జనగణమన దినపత్రిక

ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026

- క్రీడా స్ఫూర్తిని చాటేలా పోటీలు ఉండాలి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

1

జనగణమన బ్యూరో – హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి యువ క్రీడాకారులు పాల్గొనే ఈ క్రీడా సంబరాలకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటి నుంచే పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026 ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, స్టేడియంల అభివృద్ధి, క్రీడాకారులు, అధికారులు, అతిథులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

డిసెంబరులో నిర్వహణకు సన్నాహాలు: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను డిసెంబరులో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రస్తుత స్టేడియంల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, పోటీలకు అనుగుణంగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. కేవలం తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం కాకుండా, భవిష్యత్తులోనూ తెలంగాణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకునేలా స్టేడియంలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల కొరత ఉండదని సీఎం తెలిపారు. క్రీడా మైదానాలు, ప్రేక్షకుల గ్యాలరీలు, డ్రెస్సింగ్ రూమ్‌లు, పార్కింగ్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా తదితర సౌకర్యాలను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.

20 క్రీడాంశాలకు ప్రత్యేక ఏర్పాట్లు: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సుమారు 20 రకాల క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడాంశాల వారీగా పోటీ వేదికలను ముందుగానే గుర్తించాలని సీఎం సూచించారు. ప్రతి క్రీడకు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా మైదానాలు, పరికరాలు, సాంకేతిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతి, భోజనం, రవాణా, వైద్య సేవలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులు తెలంగాణలో ఆతిథ్యాన్ని గుర్తుంచుకునేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు.

ప్రముఖ క్రీడాకారుల భాగస్వామ్యం: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని సూచించారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కూడా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపే విధంగా కార్యక్రమాల రూపకల్పన ఉండాలని తెలిపారు.

అధికారులకు బాధ్యతల విభజన: క్రీడల నిర్వహణ, మౌలిక వసతులు, క్రీడాకారులు మరియు అతిథులకు అవసరమైన సౌకర్యాలు, రవాణా, భద్రత, వైద్య సేవలు తదితర విభాగాలకు సంబంధించి స్పష్టమైన పని విభజన చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి విభాగానికి బాధ్యులను నియమించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కేవలం క్రీడా పోటీలుగా కాకుండా తెలంగాణ క్రీడా సామర్థ్యాన్ని దేశానికి చాటిచెప్పే వేదికగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. పోటీల నిర్వహణలో క్రమశిక్షణ, పారదర్శకత, సమయపాలనతో పాటు క్రీడా స్ఫూర్తి ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

క్రీడా రంగానికి కొత్త ఊతం: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌–2026కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తెలంగాణలో క్రీడా మౌలిక వసతులకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. స్టేడియంల అభివృద్ధి, క్రీడా సదుపాయాల మెరుగుదలతో భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ వేదికగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, SATG చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, SATG ఎండీ సోనీబాల దేవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.