జనగణమన ప్రతినిధి – సంగారెడ్డి: రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేదల ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, మహిళలు–యువతకు అవకాశాలు, గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. పేదలకు నిత్యావసర వస్తువులు అందించేందుకు రేషన్ షాపుల వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సీఎం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలపై ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని, అయితే పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు.
‘సన్నబియ్యం పేదల ప్రతి ఇంటికీ చేరుస్తున్నాం’: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని, అవి ఒకే నాణేనికి బొమ్మా–బొరుసులాంటివని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి, తాము అధికారంలో ఉన్నప్పుడు పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం అందించాలనే ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. పేదల ప్రతి ఇంటికీ సన్నబియ్యం చేరుతున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు.
‘32 నెలల్లో కరెంటు కొరత లేకుండా సరఫరా’: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంటు ఉండదని గతంలో ప్రచారం చేశారని సీఎం గుర్తుచేశారు. అయితే తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 32 నెలల్లో ఏ ఒక్క క్షణమైనా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందా? అని ప్రశ్నించారు. ప్రతి పల్లెలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. వరి సాగుపై గతంలో ప్రతికూల వ్యాఖ్యలు చేసిన వారు ఇప్పుడు సన్నధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్ గురించి మాట్లాడాలని అన్నారు. రైతు భరోసా మొత్తాన్ని రూ.2 వేలు పెంచి ఏడాదికి రూ.12 వేలు అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా రూ.36 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు.
కేసీఆర్‌కు అసెంబ్లీలో చర్చకు సవాల్: రైతుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. “శాసనసభకు రండి.. రైతులకు మేం చేసిన మేలు ఏమిటో, మీ హయాంలో రైతులకు జరిగిన అన్యాయం ఏమిటో చర్చిద్దాం” అని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.21 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని సీఎం తెలిపారు. తెలంగాణలో రుణభారం లేని రైతులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెబుతున్నప్పటికీ, బీజేపీ నాయకులకు ఆ విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
గత 32 నెలల్లో రైతులు పండించిన ధాన్యానికి సంబంధించి రూ.90 వేల కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. రెండున్నరేళ్లలో రైతుల కోసం మొత్తం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని సీఎం పేర్కొన్నారు. రైతులను రాజులుగా గౌరవించే సంస్కృతి తమ ప్రభుత్వంలో ఉందన్నారు.
‘రెండేళ్లలో 7 లక్షల ఇళ్లు మంజూరు’: డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని గతంలో హామీలు ఇచ్చిన వారు ఏ ఒక్కరికైనా ఇళ్లు ఇచ్చారా? అని సీఎం ప్రశ్నించారు. అయితే ప్రజల తమ్ముడిగా తాను రెండేళ్లలో 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశానని తెలిపారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం తెలంగాణలో ఉండదని అన్నారు. అర్హులైన ఒంటరి మహిళలకు పెన్షన్లు అందించి ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. చేనేత, గీత కార్మికులకు కూడా పెన్షన్లు అందిస్తామని, అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
‘72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ’: యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం చెప్పారు. రెండున్నరేళ్లలో 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. నిరుద్యోగ యువత మాయమాటలు చెప్పే వారి ఉచ్చులో పడకుండా ఉద్యోగ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. మాట ఇస్తే మట్టిలో కలిసే వరకు నిలబడే నాయకత్వం కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు.
“మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మీ హక్కులను కాదనం. మీ అవకాశాలను తొలగించం” అని సీఎం అన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 2034 వరకు ప్రజల ఆశీర్వాదం తమ ప్రభుత్వానికి ఉండాలని కోరారు.
‘క్షుద్ర పూజలు చేసినా ప్రజల ఆశీర్వాదం మనవైపే’: ప్రభుత్వంపై కొంతమంది అఘోరా పూజలు, చేతబడులు చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని సీఎం ప్రస్తావించారు. ప్రజలపై ఎవరైనా చేతబడులు చేస్తారా? అని ప్రశ్నించారు. తమ నాయకులు నిజాలు మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. తమిళనాడులోని దేవాలయాలకు వెళ్లిన విషయాన్ని రహస్యంగా ఉంచిన వారు, ఇతరులపై మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని క్షుద్ర పూజలు చేసినా దేవుడి ఆశీర్వాదం తమపై ఉందని, అందుకే ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ఎల్లంపల్లి జలాశయం నిండిందని వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీర్వాదంతో పాటు ప్రజల ఆశీర్వాదం కూడా తమకు ఉండాలని కోరారు.
‘జగ్గారెడ్డి లాంటి నాయకులు అరుదు’: సంగారెడ్డి రాజకీయాలపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి పోటీ చేయాలా వద్దా అనేది ఆయన చేతిలో కూడా లేదని, అది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
రాహుల్ గాంధీని రాముడితో పోల్చుతూ, జగ్గారెడ్డి హనుమంతుడి లాంటి నాయకుడని వ్యాఖ్యానించారు. రాముడి మాటను హనుమంతుడు ఎప్పుడూ జవదాటనట్లే, రాహుల్ గాంధీ నిర్ణయాన్ని జగ్గారెడ్డి ఎప్పుడూ జవదాటరని అన్నారు.
రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా జగ్గారెడ్డి వంటి నాయకులు దొరకరని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలతోనే ఉంటున్న నాయకుడు జగ్గారెడ్డి అని కొనియాడారు. తెలంగాణలో జగ్గారెడ్డి వంటి నాయకులు అరుదని, అలాంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండాల్సిన అవసరం ఉందని, ప్రజలు ఆయనకు అండగా నిలవాలని కోరారు.
పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు ఉద్యోగాలు, మహిళలకు భరోసా, ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం, ఆశీర్వాదం కొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.