జనగణమన ప్రతినిధి – మెదక్: మెదక్ జిల్లా కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలు గైర్హాజరు కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలేం జరిగింది?
తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మెదక్ జిల్లా నేతలతో సమీక్షా సమావేశం, PAC మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు అందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీ నేతలు, బ్లాక్ అధ్యక్షులు హాజరు కావాల్సి ఉంది. అయితే పీసీసీ చీఫ్ సమావేశానికే జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పలువురు సీనియర్ నేతలు, తూంకుంట వర్గానికి చెందిన నేతలు డుమ్మా కొట్టారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జి. వివేకానంద గైర్హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో పీసీసీ చీఫ్‌కే షాక్ తగిలినట్లు అయ్యిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
డీసీసీ పీఠం కోసం వార్
అసలు వివాదానికి ప్రధాన కారణం డీసీసీ అధ్యక్ష పదవి అని తెలుస్తోంది. మెదక్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ముగ్గురు నలుగురు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒక వర్గం తూంకుంట వర్గం నుంచి తమకే పదవి కావాలని పట్టుబడుతుంటే, మరో వర్గం కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. పదవుల పంచాయితీతో నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని, ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారని స్థానిక క్యాడర్ చెబుతోంది.
పీసీసీ ఆదేశాలను ధిక్కరించారా?
పీసీసీ అధిష్టానం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ చాలా ముఖ్యమని, పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు ఉంటాయని గతంలో మెదక్, మల్కాజ్‌గిరి సమీక్షలో మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. అయినప్పటికీ అదే తీరు కొనసాగడం పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉంది. సోమవారం మెదక్‌లో జరిగిన మీటింగ్ తర్వాత మాట్లాడిన మహేష్ గౌడ్, గత మూడేళ్లలో కాంగ్రెస్ క్యాడర్‌కు తగిన అవకాశాలు రాలేదని అంగీకరించారు. ఇకపై నామినేటెడ్ పోస్టుల్లో డీసీసీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు.
అధిష్టానం ఏం చేస్తుంది?
స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇలాంటి విభేదాలు పార్టీకి నష్టం చేకూరుస్తాయనికి హైకమాండ్ భావిస్తోంది. “అందరూ హైకమాండ్ రాడార్‌లో ఉన్నారు, గోడలకు కూడా చెవులు ఉంటాయి” అని ఇటీవల మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మెదక్ కాంగ్రెస్‌లో ఇందిరాగాంధీ కాలం నాటి నుంచి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ, బీఆర్ఎస్‌లను ఎదుర్కోవాలంటే ఐక్యత అవసరమని గాంధీ భవన్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెళ్తున్నాయి. డీసీసీ నియామకాల ప్రక్రియను తుది దశకు తీసుకొచ్చింది. ఒకటి రెండు రోజుల్లో కొత్త డీసీసీలను ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. మెదక్ విషయంలో మాత్రం ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో కూడా హైకమాండ్ ఉన్నట్లు సమాచారం.
మొత్తానికి మెదక్‌లో పదవుల కోసం జరుగుతున్న ఈ కోల్డ్ వార్‌కు అధిష్టానం ఎలా ఫుల్‌స్టాప్ పెడుతుందో వేచి చూడాలి.