జనగణమన దినపత్రిక

రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి

ఢిల్లీలో ఆయన చిత్రపటానికి నివాళి

2

ఢిల్లీ, జూలై 28: రాజకీయాల్లో నైతికత, విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ చేసిన అరుదైన నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విద్యార్థి నాయకుడిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన జైపాల్ రెడ్డి తన చివరి శ్వాస వరకు ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని, రాజకీయ నైతికతను కాపాడుతూ ఆదర్శప్రాయమైన రాజకీయ జీవితం గడిపారని కొనియాడారు. అధికారం కంటే విలువలకు, పదవుల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పార్లమెంట్‌లో తన అసాధారణ విషయ పరిజ్ఞానం, విశ్లేషణాత్మక దృక్పథం, అద్భుతమైన వాగ్ధాటితో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని సీఎం తెలిపారు. ఏ అంశంపైనా లోతైన అవగాహనతో మాట్లాడే సామర్థ్యం, హుందాతనం, సంయమనంతో కూడిన రాజకీయ శైలి జైపాల్ రెడ్డిని ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని పేర్కొన్నారు.

తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని, యువ రాజకీయ నాయకులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజాసేవలో నిబద్ధత, పారదర్శకత, నైతిక విలువలను పాటిస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రోహిణ్ రెడ్డి, తుమ్మల యుగంధర్ తదితరులు పాల్గొని జైపాల్ రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.