జనగణమన దినపత్రిక

అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ అజెండా: సీఎం

- నల్గొండ సభలో ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు

18

నల్గొండ, జూన్ 27: రాష్ట్రంలో రూ.13 వేల కోట్ల వ్యయంతో 6,300 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్గొండలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్షాల వైఖరి తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని త్యాగం చేశారని, మలి దశ ఉద్యమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం అమరణ నిరాహార దీక్ష చేసిన నాయకుడిగా కోమటిరెడ్డి పేరును నల్గొండ ప్రజలు గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు త్యాగాల గురించి మాట్లాడుతున్నారని, రాజీనామాలు చేసి ఎన్నికలు తెచ్చుకోవడం, ఆ పేరుతో నిధులు సేకరించడం త్యాగమా అని ప్రశ్నించారు. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వంటి అమరవీరుల త్యాగాలను మరవొద్దని అన్నారు.

బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను రూ.8.11 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని ఆరోపించారు. “తెలంగాణను వందేళ్ల విధ్వంసానికి గురిచేశారు. ప్రజలు మళ్లీ మీకు అధికారం ఇవ్వాలని కోరుకోవడం లేదు. మీ కుటుంబమే కోరుకుంటోంది. తెలంగాణ సమాజం మీ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించింది” అని వ్యాఖ్యానించారు. నల్గొండ ప్రజలు బీఆర్ఎస్‌ను “ఉప్పుపాతర వేశామని, మళ్లీ మొలకెత్తనివ్వమని” చెప్పారని అన్నారు. సూర్యాపేటలో ఒక్క నాయకుడు మాత్రమే మిగిలాడని, అతడిని కూడా రాజకీయంగా నిలవనివ్వబోమని పార్టీ కార్యకర్తలు తనతో చెప్పారని వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో చర్చకు సిద్ధం: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు, బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధమని సీఎం ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోల అమలుపై కూడా బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ప్రతిపక్షాలు స్పీకర్, శాసన మండలి ఛైర్మన్‌కు లేఖ రాస్తే చర్చ నిర్వహిస్తామని, ఎవరు ఏం చేశారో ప్రజల ముందు తేల్చుకుందామని సవాల్ విసిరారు.

సంక్షేమ కార్యక్రమాలపై వివరణ: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించిన సీఎం, తమ ప్రభుత్వం లక్షలాది కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందన్నారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు రూ.16 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. మూడు కోట్ల 28 లక్షల మందికి ప్రతి నెల ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. గతంలో పేదలకు ఇచ్చిన బియ్యం పశువుల మేతగా మారేదని, ఇప్పుడు ధనికులు తినే బియ్యమే పేదల ఇళ్లకు చేరుతోందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నాలుగున్నర లక్షల పేద కుటుంబాలకు గృహాలు మంజూరు చేశామని చెప్పారు. గత ప్రభుత్వం పేదల ఇళ్ల గురించి ఆలోచించకుండా ఫామ్‌హౌస్‌ల నిర్మాణంపైనే దృష్టి పెట్టిందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నామని తెలిపారు.

వ్యవసాయం, సాగునీటిపై వ్యాఖ్యలు: రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బోనస్ వంటి పథకాల ద్వారా రైతుల కోసం రూ.1.56 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశామని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చామని, రైతుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రం రికార్డు సృష్టించిందన్నారు. కాళేశ్వరం నుంచి నీరు రాకపోయినా రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా విమర్శలు చేస్తూ, లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్టు చివరకు “కూలేశ్వరం”గా మారిందని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును గత ప్రభుత్వం పదేళ్లు నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం పూర్తి చేసి మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుందని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తామని ప్రకటించారు.

విద్య, ఉద్యోగాలపై హామీలు: ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సమగ్ర విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన ప్రభుత్వ విద్య ద్వారా వందలాది అంబేద్కర్లను తయారు చేయడమే లక్ష్యమన్నారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, పేద పిల్లలకు ఆధునిక విద్య అందించేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపామని, కేవలం 30 నెలల్లోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడామని పేర్కొన్నారు.

మూసీ ప్రక్షాళనపై స్పష్టత: మూసీ నది కాలుష్యం వల్ల నల్గొండ ప్రాంతంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అందుకే మూసీ ప్రక్షాళన చేపట్టామని సీఎం అన్నారు. ఎలాంటి అడ్డంకులు వచ్చినా మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని స్పష్టం చేశారు.

ప్రజాపాలన కొనసాగుతుందన్న సీఎం: రైతు భరోసా, రుణమాఫీ, స్కిల్ యూనివర్సిటీ, సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రజాపాలన ఎందుకు ముగియాలని ప్రశ్నించారు.

ప్రతిపక్ష నాయకులు గ్రామాలు తిరుగుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేసి, అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని దోచుకున్న విషయాన్ని ప్రజలు మరచిపోలేదని అన్నారు.

చివరగా, “2024 నుంచి 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం. ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.