అర్హులైన ఒక్క ఓటరు పేరు తొలగొద్దు
- సర్ ప్రక్రియలో పారదర్శకత, సహజ న్యాయం పాటించాలి: ఈసీఐకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
జనగణమన బ్యూరో – హైదరాబాద్: తెలంగాణలో 2026 ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకూడదని, అదే సమయంలో అనర్హులైన వ్యక్తుల పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన విధానపరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతూ భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు తగిన సమయం, అవసరమైన సహాయం అందించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న గడువును పొడిగించాలని సీఎం కోరారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వివాహాలు తదితర కారణాలతో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివాసం మార్చుకున్న ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు.
3.38 కోట్ల ఓటర్లలో 73.39 లక్షల మంది ASDD కేటగిరీలో
2026 జూన్ 10 నాటికి తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. వీరిలో 73.39 లక్షల మందిని—అంటే మొత్తం ఓటర్లలో 21.7 శాతాన్ని—గైర్హాజరైన, నివాసం మారిన, మరణించిన లేదా ఒకటికి మించి నమోదైన ఓటర్లుగా (ASDD) గుర్తించినట్లు ఈసీ గణాంకాలను ఉటంకించారు. ఈ ASDD వర్గంలో సుమారు 62 శాతం, అంటే 45.19 లక్షల మందిని శాశ్వతంగా నివాసం మారిన వారిగా గుర్తించడం ఆందోళనకరమైన అంశమని సీఎం పేర్కొన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాస్తవంగా నివాసం మార్చుకున్న వారికి కొత్త ప్రాంతంలో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం, అవసరమైన సహాయం కల్పించిన తర్వాతే పాత చిరునామాలోని ఓటును తొలగించే విధానం ఉండాలని సూచించారు.
92.86 లక్షల మంది ఓటర్లపై నోటీసుల ప్రభావం
రాష్ట్రంలో డిజిటలైజ్ చేసిన 2.65 కోట్ల గణన పత్రాల్లో 60.50 లక్షల పత్రాల్లో లోపాలు ఉన్నట్లు, మరో 32.36 లక్షల పత్రాలకు గత ఓటర్ల జాబితాతో అనుసంధానం జరగలేదని సీఎం తెలిపారు. ఈ రెండు అంశాల కారణంగా సుమారు 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఇది రాష్ట్రంలోని దాదాపు మూడో వంతు ఓటర్లను ప్రభావితం చేసే అంశమని, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు విచారణ, పత్రాల సమర్పణ ప్రక్రియను ఎదుర్కోవాల్సి వస్తున్నందున తగినంత సమయం, మౌలిక సదుపాయాలు, సహాయక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం వివరించారు.
తాత్కాలికంగా ఇళ్లలో లేనివారిని కూడా పరిశీలించాలి
ప్రస్తుత సవరణ విధానంలో కొన్ని కీలకమైన లోపాలు ఉన్నాయని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. గణన సిబ్బంది ఇంటింటి పరిశీలనకు వచ్చిన సమయంలో తాత్కాలికంగా ఇంట్లో లేని వ్యక్తులను, శాశ్వతంగా నివాసం మార్చుకున్న వ్యక్తులను ఒకే విధంగా పరిగణించడం వల్ల నిజమైన ఓటర్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.
ఉద్యోగం, విద్య, వివాహం లేదా ఇతర కారణాలతో కొంతకాలం వేరే ప్రాంతంలో నివసించే వ్యక్తులను శాశ్వతంగా వలస వెళ్లిన వారిగా పరిగణించరాదని సూచించారు. నిజంగా నివాసం మార్చుకున్న వారి విషయంలో కూడా కొత్త ప్రాంతంలో ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకునేందుకు సహాయం అందించాలని కోరారు.
నోటీసు లేకుండా ఓటు తొలగించొద్దు
నివాసం మార్చుకున్నట్లు గుర్తించిన ఓటర్ల పేర్లను పాత చిరునామా నుంచి తొలగించే ముందు అధికారిక నోటీసు ప్రక్రియను తప్పనిసరిగా పాటించాలని సీఎం కోరారు. ఓటరు తన పేరు తొలగించబడిన విషయాన్ని పోలింగ్ రోజున ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మాత్రమే తెలుసుకునే పరిస్థితి రాకూడదని అన్నారు. ఇలాంటి పరిస్థితి ఓటు హక్కుకు తీవ్ర విఘాతం కలిగించడమే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా మారే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఓటరుకు తన అభ్యంతరం వ్యక్తం చేసుకునే, అవసరమైన పత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు.
మూడు జిల్లాల్లోనే 58.6 శాతం ASDD కేసులు
హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే రాష్ట్రంలోని మొత్తం ASDD ఓటర్లలో 58.6 శాతం కేంద్రీకృతమై ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే పరిశీలనకు సంబంధించిన నోటీసుల్లో 41.9 శాతం ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వివాహాలు, విద్య, వ్యాపారం వంటి కారణాలతో తరచూ నివాస మార్పులు జరిగే నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఓటర్లపై నోటీసుల ప్రభావం ఉండటంతో వికేంద్రీకృత స్థాయిలో సహాయ, విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
గడువు మరో నాలుగు వారాలు పొడిగించాలి
తెలంగాణలో సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేవని సీఎం గుర్తుచేశారు. అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తొందరపాటు లేకుండా సమగ్రంగా నిర్వహించేందుకు తగిన సమయం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఉన్న అభ్యంతరాలు, ఫిర్యాదుల గడువును మరో నాలుగు వారాలు పొడిగించాలని కోరారు. అదే విధంగా తుది ఓటర్ల జాబితా ప్రచురణకు నిర్ణయించిన అక్టోబర్ 19 తేదీని కూడా తదనుగుణంగా సవరించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.
గ్రామసభలు, వార్డు సమావేశాలు నిర్వహించాలి
గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో SIR ప్రక్రియపై ముందుగానే విస్తృత ప్రచారం నిర్వహించాలని సీఎం సూచించారు. కనీసం రెండుసార్లు గ్రామసభలు, వార్డు కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రజల సమక్షంలో బహిరంగంగా చదివి వినిపించాలని కోరారు. ప్రజలకు తమ పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకునే అవకాశం కల్పించడంతో పాటు, తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
పత్రాల సమర్పణకు 3–4 వారాల సమయం
నోటీసులు అందుకున్న రోజువారీ కూలీలు, వలస కార్మికులు, వయోవృద్ధులు అవసరమైన పత్రాలను సేకరించి సమర్పించేందుకు కేవలం వారం రోజుల గడువు సరిపోదని సీఎం పేర్కొన్నారు. కనీసం మూడు నుంచి నాలుగు వారాల సమయం ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నియోజకవర్గ, పోలింగ్ కేంద్ర స్థాయిలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఓటర్లకు ఏ పత్రాలు అవసరమో వివరించడంతో పాటు వాటిని పొందేందుకు కూడా సహకరించాలని సూచించారు.
ఆధారాల జాబితాను విస్తరించాలి
ప్రభుత్వ ఉత్తర్వు నంబర్ 172 ప్రకారం జారీ చేసే కుటుంబ నమోదు ధ్రువపత్రాన్ని అంగీకరించకపోవడం వల్ల పట్టణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని సీఎం తెలిపారు. మండల స్థాయిలో సులభంగా లభించే ఇతర చెల్లుబాటు అయ్యే పత్రాలను కూడా అంగీకరించేలా ఆధారాల జాబితాను సవరించి విస్తరించాలని కోరారు. ఓటర్లకు అందుబాటులో ఉన్న పత్రాలను ఆధారంగా తీసుకుని వారి వివరాలను పరిశీలించే విధంగా సౌకర్యవంతమైన విధానాన్ని రూపొందించాలని సూచించారు.
హైదరాబాద్‌లో అదనపు అధికారుల నియామకం
హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గంలో సగటున 78 వేలకుపైగా కేసులు ఉన్న నేపథ్యంలో కేవలం పరిమిత సంఖ్యలో ఓటర్ల నమోదు అధికారులతో విచారణ ప్రక్రియను పూర్తి చేయడం సాధ్యం కాదని సీఎం పేర్కొన్నారు. అందువల్ల ఓటర్ల నమోదు అధికారి స్థాయికి దిగువన అదనపు అధికారులను నియమించాలని కోరారు. ముద్రిత నోటీసుల్లోనే విచారణకు సంబంధించిన నిర్దిష్ట తేదీ, సమయం పేర్కొనడంతో పాటు వికేంద్రీకృత విచారణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ అభ్యంతరాలను సులభంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు.
ప్రభుత్వ సహకారం పూర్తిస్థాయిలో అందిస్తాం
SIR ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అర్హత ఉన్న ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ కేంద్రాల ఏర్పాటు, గ్రామసభలు, వార్డు సమావేశాల నిర్వహణతో పాటు పరిపాలనా మరియు ఇతర అవసరమైన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈసీఐకి రాసిన లేఖలో సీఎం స్పష్టం చేశారు.
అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా తొలగకుండా, అనర్హులైన ఒక్కరి పేరు కూడా జాబితాలో చేరకుండా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, న్యాయబద్ధంగా నిర్వహించడమే లక్ష్యంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.