జనగణమన దినపత్రిక

ప్రజలకు–కార్యకర్తలకు–హరీష్‌కు మధ్య గ్యాప్ పెరుగుతుందా?

- కోటరీ రాజకీయంగా నష్టం చేస్తుందా?

4

జనగణమన ప్రతినిధి – సిద్దిపేట: ఒక నాయకుడి బలం కేవలం అతని వ్యక్తిగత ప్రజాదరణ మాత్రమే కాదు. అతని చుట్టూ ఉండే బృందం, కార్యకర్తలతో అతనికి ఉండే అనుబంధం, ప్రజలతో నేరుగా ఏర్పడే సంబంధం కూడా అంతే కీలకం. రాజకీయ చరిత్రలో నాయకులను ప్రత్యర్థుల కంటే ఎక్కువగా దెబ్బతీసిన సందర్భాలు చాలావరకు వారి చుట్టూ ఏర్పడిన కోటరీలే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇదే తరహా చర్చ ఇప్పుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజకీయాల చుట్టూ కూడా వినిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజలతో మమేకమై, అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్ రావు చుట్టూ ఏర్పడిన కొందరు నాయకుల వ్యవహారశైలి కారణంగా ప్రజలు, కార్యకర్తలు ఆయనకు దూరమవుతున్నారనే అభిప్రాయాలు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.

ఉద్యమ నాయకుడి నుంచి ప్రజానాయకుడిగా: తెలంగాణ ఉద్యమ కాలంలో హరీష్ రావు ప్రజల మధ్య తిరుగుతూ, ప్రతి సమస్యకు స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉద్యమం అనంతరం మంత్రిగా ఇరిగేషన్, ఆర్థిక, ఆరోగ్య వంటి కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రభుత్వ బాధ్యతలు, పార్టీ కార్యక్రమాలతో రాష్ట్రవ్యాప్తంగా బిజీగా ఉండటంతో సిద్దిపేటలో స్థానిక నాయకులకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ప్రారంభంలో ఇది సమర్థవంతంగా సాగినా, కాలక్రమేణా అదే వ్యవస్థ కోటరీగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కోటరీ అడ్డుగోడగా మారిందా?

స్థానికంగా ప్రజలు లేదా కార్యకర్తలు హరీష్ రావును కలవాలంటే ముందుగా కొందరు నాయకులను సంప్రదించాల్సిందే అనే పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలకు, నాయకుడికి మధ్య నేరుగా ఉండాల్సిన సంబంధం బలహీనపడిందని అంటున్నారు. హరీష్ రావు పేరు చెప్పుకుంటూ కొందరు నిర్ణయాలు తీసుకోవడం, ప్రతి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం, పార్టీ కార్యకర్తలకే ఇబ్బందులు కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తగ్గిన మెజార్టీపై చర్చ: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు సుమారు 1.18 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే 2023 ఎన్నికల్లో ఆ మెజార్టీ సుమారు 80 వేల ఓట్లకు పరిమితమైంది. వ్యక్తిగత ఇమేజ్ బలంగానే ఉన్నప్పటికీ, పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరగడం, స్థానిక వ్యవహారాలపై వచ్చిన విమర్శలు కూడా ఇందుకు ఒక కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఓటు శాతం తగ్గడం ఇదే చర్చకు మరింత బలం చేకూర్చిందని చెబుతున్నారు.

ఆరోపణలు: స్థానికంగా కొందరు నాయకులపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ వివాదాల్లో జోక్యం చేసుకోవడం, భూ కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. అదే విధంగా ఆర్థిక లావాదేవీల్లో అనుచిత వ్యవహారాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జోక్యం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితబంధు, సీఎంఆర్ఎఫ్ వంటి పథకాలలో లబ్ధిదారుల నుంచి ప్రయోజనాలు పొందారనే విమర్శలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలపై దృష్టి పెట్టక పోవడం కూడా హరీష్ రావుపై విమర్శలు రావడానికి అవకాశం కలుగుతుంది.

అయితే ఈ ఆరోపణలకు సంబంధించి హరీష్ రావు అంటే గిట్టనివారు ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలే అని, ఈ ఆరోపణలను ఖండించే అవకాశం ఉంది.

కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి: హరీష్ రావుపై వ్యక్తిగత అభిమానం ఉన్నప్పటికీ, ఆయనను నేరుగా కలిసే అవకాశం లేకపోవడం వల్ల అనేక మంది కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. తమ సమస్యలు చెప్పుకునే అవకాశాలు తగ్గిపోయాయని, కొందరి అనుమతి లేకుండా నాయకుడిని కలవలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా నిలిచే నిబద్ధత కలిగిన కార్యకర్తల ఉత్సాహం దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఫ్లెక్సీ వివాదం కూడా చర్చనీయాంశమే: ఇటీవల చోటుచేసుకున్న ఫ్లెక్సీల వివాదంలో కోటరీగా పేరొందిన నాయకుల కంటే సాధారణ కార్యకర్తలే ముందుండి స్పందించారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. దీంతో అసలు పార్టీ బలం ఎవరు? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

కాంగ్రెస్–బీజేపీ వ్యూహం: సిద్దిపేటలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్‌ను రాజకీయంగా బలహీనపరిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ సమయంలో పార్టీ అంతర్గత అసంతృప్తి పెరగడం ప్రత్యర్థులకు అవకాశం కల్పించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హరీష్‌ రావుకు ఉన్న బలం: ఈ విమర్శలన్నింటి మధ్య కూడా హరీష్ రావుకు వ్యక్తిగతంగా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో గణనీయమైన ఆదరణ ఉందని రాజకీయ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఆయన వ్యక్తిగత సేవా కార్యక్రమాలు, అందుబాటులో ఉండే స్వభావం ఇప్పటికీ ఆయనకు ప్రధాన బలంగా నిలుస్తున్నాయి.

కార్యకర్తల అభిప్రాయం: పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న అభిప్రాయం ప్రకారం, హరీష్ రావు మరోసారి నేరుగా ప్రజలు, కార్యకర్తలతో మమేకమై, మధ్యవర్తులపై ఆధారపడకుండా పార్టీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది. ఏ నాయకుడికైనా కార్యకర్తలే నిజమైన బలం. ప్రజలతో నేరుగా ఉండే సంబంధమే రాజకీయ విజయానికి పునాది. హరీష్ రావు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారనేదే రానున్న రోజుల్లో సిద్దిపేట రాజకీయాల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.