జనగణమన దినపత్రిక

కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన

- అడుగడుగునా అడ్డగింతలు.. వారం రోజులు కేసీఆర్ కు ఇవ్వాలని డిమాండ్ చేసిన కేటీఆర్

1

మహదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా), జూలై 5: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శన సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) నేతృత్వంలోని బృందాన్ని పోలీసులు పలు చోట్ల అడ్డుకోవడంతో ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఉదయం నుంచే పలువురు బీఆర్‌ఎస్ నాయకులను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు, కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసులను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారని ఆయన విమర్శించారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులను అధిగమించి పంప్‌హౌస్‌కు చేరుకున్నామని తెలిపారు.

పంప్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడిన కేటీఆర్, “దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూసిన తెలంగాణ రైతులకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం వంటి మహాయజ్ఞాన్ని నిర్మించారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి మేము ఇక్కడికి రాలేదు. రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టు పరిస్థితిని ప్రజలకు తెలియజేయడానికే వచ్చాం” అని అన్నారు. ఒక వారం రోజుల పాటు కాళేశ్వరాన్ని కేసీఆర్ కి అప్పగిస్తే రాష్ట్రం మొత్తానికి నీళ్లు అందిస్తామని డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో పంపులు నిరుపయోగంగా ఉండటం, నీటి వినియోగంలో నిర్లక్ష్యం, ప్రాజెక్టు నిర్వహణలో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ పర్యటన చేపట్టినట్లు కేటీఆర్ వెల్లడించారు. రైతులకు సాగునీరు అందించే కీలక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీసుల అడ్డంకుల మధ్య బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముందుకు సాగగా, కొంతసేపు తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కేటీఆర్ నేతృత్వంలోని బృందం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను పరిశీలించి, అక్కడి పరిస్థితులపై అధికారులను ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించి రైతులకు సకాలంలో సాగునీరు అందించే చర్యలు చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టును రాజకీయాలకు అతీతంగా సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటన నేపథ్యంలో పోలీసులు–బీఆర్‌ఎస్ నాయకుల మధ్య చోటుచేసుకున్న పరిణామాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Leave A Reply

Your email address will not be published.