జనగణమన దినపత్రిక

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగింపు

- వెంటనే అమల్లోకి.. గవర్నర్‌కు సిఫారసు పంపిన సీఎం రేవంత్‌రెడ్డి

2

జనగణమన బ్యూరో  – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో పేర్కొంది. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలన్న సిఫారసును ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌కు పంపినట్లు వెల్లడించింది.

ప్లానింగ్ బోర్డులో మార్పులు

తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణ ప్రభావంతో రద్దు చేశారు. ఆయన స్థానంలో గద్వాల విజయలక్ష్మిని తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు, వివిధ రంగాలకు సంబంధించిన విధాన రూపకల్పనలో ప్లానింగ్ బోర్డు కీలక పాత్ర పోషించే నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.

మహిళా కమిషన్‌కు నెల్లెల్ల శారద

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నెల్లెల్ల శారదను నియమించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఆమె చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

కుడా చైర్‌పర్సన్‌గా మాజీ ఎంపీ సుధారాణి

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణిని నియమించేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారు. వరంగల్ ప్రాంత పట్టణాభివృద్ధికి సంబంధించిన కీలక సంస్థ అయిన కుడాకు కొత్త నాయకత్వం నియామకం కావడంతో సంస్థ కార్యకలాపాలపై కూడా ఆసక్తి నెలకొంది.

ఒకేసారి కీలక నిర్ణయాలు

మంత్రి పదవి నుంచి కొండా సురేఖ తొలగింపు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిలో మార్పు, మహిళా కమిషన్‌కు కొత్త చైర్‌పర్సన్, కుడాకు కొత్త చైర్‌పర్సన్ నియామకం వంటి నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.