అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన

- తెలంగాణను ఎవరూ చెరబట్టలేరంటూ సీఎం ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్, జూలై 19: ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ స్మృతిని చిరస్థాయిగా నిలిపే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని భావోద్వేగ ప్రసంగంతో పాటు ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అందెశ్రీ తనకు కేవలం కవి మాత్రమే కాదని, ఆత్మబంధువని పేర్కొన్న సీఎం, తెలంగాణ ఉద్యమానికి ఆయన రచనలు ప్రాణం పోశాయని కొనియాడారు.

అందెశ్రీ పాటలు తెలంగాణ సమాజంలో చైతన్యం నింపాయని, ఉద్యమ గీతాలు తూటాల్లా మారి అన్యాయాన్ని ఎదుర్కొన్నాయని సీఎం అన్నారు. నిరాశ, నిస్పృహల సమయంలో అందెశ్రీ తనకు స్ఫూర్తిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఇటుకపై ఇటుక పేర్చి గోడలు కట్టిన తాపీ మేస్త్రి అయిన ఆయన, అక్షరాలపై అక్షరాలు పేర్చి ఉద్యమ చరిత్రను సృష్టించారని ప్రశంసించారు.

తెలంగాణ రాష్ట్ర గీతంగా నిలిచిన “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని, అయితే గత పదేళ్లలో కుట్రపూరితంగా ఆ గీతాన్ని వినిపించకుండా చేశారని ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి పాఠశాలలో, ప్రతి ఇంట్లో ఆ గీతం మారుమోగుతోందని పేర్కొన్నారు. అందెశ్రీ ఎప్పుడూ అధికార గడపలు తొక్కలేదని, తన ఆత్మగౌరవాన్ని రాజీపడలేదని సీఎం అన్నారు. కోట్లాది తెలంగాణ ప్రజల కోసమే ఆయన కలం కదిలిందని, దొరల కోసం కాదు అని వ్యాఖ్యానించారు. తన కుటుంబంలో పెద్దన్నగా అందెశ్రీని భావించానని చెప్పారు.

గత ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ, అందెశ్రీ గళాన్ని బంధించేందుకు, ప్రజాగాయకుడు గద్దర్‌ను అవమానించేందుకు ప్రయత్నించిన రోజే ఆ పాలనను ప్రజలు శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు.

ప్రతిపక్షంపై ఘాటు విమర్శలు: ప్రతిపక్ష నాయకులను ఉద్దేశించి సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మేక తోలు కప్పుకున్న తోడేళ్లు” అంటూ విమర్శించిన ఆయన, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడమే తప్ప ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆరోపించారు. పేపర్ లీకేజీలతో వందల కోట్ల రూపాయలు సంపాదించారని, కానీ నిరుద్యోగుల భవిష్యత్తుపై ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అడ్డంకులను తొలగించి ఏడాదిలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని తెలిపారు. ఎల్బీ స్టేడియం, శిల్పకళా వేదికల్లో తల్లిదండ్రుల సమక్షంలో నియామక పత్రాలు అందజేసిన సందర్భాలను గుర్తు చేశారు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది ఎవరో ప్రజలు బాగా తెలుసని, తాము మాత్రం ప్రజల సంక్షేమం, యువత భవిష్యత్తు కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

తెలంగాణను ఎవరూ చెరబట్టలేరు: తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తోందని, నిజాంను ఎదిరించిన చరిత్ర ఈ నేలదని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ చైతన్యం ముందు ఎవరూ నిలవలేరని, తెలంగాణను చెరబట్టాలని చూస్తే అందెశ్రీ పాటగా తిరిగి వస్తారని వ్యాఖ్యానించారు. “నేను ఉన్నంత వరకు ఈ తెలంగాణ తులసి వనంలో గంజాయి మొక్కను మొలకెత్తనివ్వం” అంటూ రాజకీయ ప్రత్యర్థులపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమకు అందెశ్రీ, గద్దర్, సోనియా గాంధీ స్ఫూర్తి అని, ప్రతిపక్షానికి నిజాం, ఖాసీం రిజ్వీ స్ఫూర్తినా అని ప్రశ్నించారు.

ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే: ప్రజా ప్రభుత్వం కవులు, ఉద్యమకారులను గౌరవిస్తోందని సీఎం చెప్పారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ సభ్యులుగా నియమించామని, ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించామని తెలిపారు. తొమ్మిది మంది కవులను సన్మానించి కోటి రూపాయల నగదు బహుమతి అందించామని గుర్తు చేశారు. ప్రతిపక్షం కుటుంబ పాలన కోసం అధికారాన్ని కోరుకుంటోందని ఆరోపించిన సీఎం, ప్రజా ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తోందని అన్నారు. నిరుద్యోగులు మోసపూరిత ప్రచారాలను నమ్మవద్దని సూచిస్తూ, ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.