ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణానికి పునాది: సీఎం రేవంత్ రెడ్డి
- కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాలకు నూతన భవనం ప్రారంభం
కొత్తకోట, జూలై 15: “ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేనే ముఖ్యమంత్రి అయ్యాను.. మీరు కూడా ఉన్నత శిఖరాలకు చేరాలి. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే తెలంగాణ భవిష్యత్తును నిర్మించే మార్గమని” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువే ప్రతి విద్యార్థి భవిష్యత్తును నిర్ణయిస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపేదీ, ఆత్మగౌరవాన్ని పెంచేదీ విద్యేనని సీఎం పేర్కొన్నారు. తల్లిదండ్రుల కళ్లలో ఆనందం నింపేది కూడా విద్యేనని చెప్పారు. గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖకు సమర్థులైన సీనియర్ అధికారులను నియమించి సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని తాను గట్టిగా నమ్ముతున్నందునే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని వెల్లడించారు. తెలంగాణ అమరుల ఆశయాలకు గత ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించిన సీఎం, తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్న అమరుల సంకల్పాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత కారణంగానే విద్యార్థుల సంఖ్య తగ్గిందని పేర్కొన్న ఆయన, గతంలో ఈ పాఠశాల అభివృద్ధిని పట్టించుకోని వారిపై విమర్శలు చేశారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కృషితో ఈ పాఠశాలకు నూతన భవనాలు నిర్మించి అవసరమైన సౌకర్యాలు కల్పించారని ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా విద్యా సమస్యలకు పరిష్కారం లభించదని స్పష్టం చేసిన సీఎం, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలను పూర్తి చేసి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించిందని తెలిపారు.
విద్యారంగంలో తెలంగాణ ప్రస్తుతం దేశంలో 18వ స్థానంలో ఉందని, దానిని తొలి రెండు స్థానాల్లో నిలబెట్టే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే చర్యలు చేపట్టామని, ఐటీఐలను ఆధునిక ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేశామని చెప్పారు. జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాలకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27.50 లక్షల మంది విద్యార్థులకు ఆగస్టు 15లోగా “యంగ్ ఇండియా కిట్స్” పంపిణీ పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. “ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఏమవుతారని ఎవరైనా అడిగితే మీ రేవంతన్నను చూపించండి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన నేనే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నాను” అని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా సీఎం వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, విద్యార్థులు కలం పట్టి రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, మట్టిలోని మాణిక్యాలను వెలికితీయాలని సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.1.08 లక్షలు ఖర్చు చేస్తోందని పేర్కొన్న సీఎం, విద్యార్థులంతా బాగా చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.