విద్యాశాఖ కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసు
- హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాల అమలు పిటిషన్ పై విచారణ
జనగణమన బ్యూరో – హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీకి సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సొసైటీ నిధుల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేపడుతున్నారంటూ గతంలో దాఖలైన పిటిషన్‌పై ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని పేర్కొంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది.
విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ నిధుల వ్యవహారం, నియామకాలకు సంబంధించిన అంశాలపై గతంలో హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నియామకాలు చేపడుతున్నారనే ఆరోపణలతో పాటు సొసైటీ నిధుల వినియోగంపై కూడా పిటిషన్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన అప్పటి డివిజన్ బెంచ్.. పిటిషనర్ సమర్పించిన రిప్రజెంటేషన్‌ను పరిశీలించి మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శిని ఆదేశించింది. అలాగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ నిబంధనలకు అనుగుణంగా నడుస్తోందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాటిని అమలు చేయలేదని ఆరోపిస్తూ పిటిషనర్ దుర్గం రవీందర్ తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. గతంలో ఇచ్చిన ఆదేశాల అమలు తీరుపై వివరణ ఇవ్వాల్సిందిగా విద్యాశాఖ కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి కి నాలుగు వారాల గడువు విధించింది.
కోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్ రిప్రజెంటేషన్‌పై తీసుకున్న చర్యలు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ నిబంధనల అమలు, నియామకాలు మరియు ఇతర సంబంధిత అంశాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.