కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్‌కు మూడేళ్లు
- వయోజనుల వ్యాధి నిరోధకత, నివారణ ఆరోగ్య సంరక్షణలో కీలక మైలురాయి
జనగణమన బ్యూరో – హైదరాబాద్: వయోజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాంటినెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత్‌లో అడల్ట్ ఇమ్యూనైజేషన్, ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రతినిధులు వివరించారు. ఈ కార్యక్రమానికి శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, ఛైర్మన్, ప్రముఖ బయోటెక్నాలజీ నిపుణులు డాక్టర్ వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైద్యులు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ అడల్ట్ వ్యాక్సినేషన్ సెంటర్ ద్వారా గత మూడేళ్లలో 25 వేలకుపైగా వ్యాక్సిన్ డోసులు అందించగా, 12 వేల మందికిపైగా వయోజనులు ఇన్‌ఫ్లూయెంజా, టైఫాయిడ్, హెపటైటిస్-బి తదితర వ్యాధుల నుంచి రక్షణ పొందినట్లు ఆసుపత్రి వెల్లడించింది.
ఈ సందర్భంగా డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వ్యాధుల నివారణలో టీకాలు అత్యంత కీలకమైనవని అన్నారు. వ్యాక్సిన్లు వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు ప్రాణనష్టాన్ని 80 శాతానికి పైగా తగ్గించగలవని పేర్కొన్నారు. వేలాది మంది వయోజనులకు టీకాలు అందించేందుకు కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక పరిమాణంలో తక్కువ ధరకు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటైనప్పటికీ, వయోజనుల వ్యాక్సినేషన్‌పై ఆశించిన స్థాయిలో అవగాహన, శ్రద్ధ లేకపోవడం ఆందోళనకరమన్నారు. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో వ్యాక్సిన్లు చాలా సరసమైన ధరలకు అందుబాటులో ఉండటం సానుకూల అంశమని తెలిపారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ గురు ఎన్. రెడ్డి మాట్లాడుతూ భారత్‌లో పిల్లల వ్యాక్సినేషన్ కార్యక్రమం 80 శాతానికి పైగా విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ, వయోజనుల్లో మార్గదర్శకాల ప్రకారం టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య కేవలం 2 శాతం మాత్రమేనని తెలిపారు. న్యుమోనియా, ఇన్‌ఫ్లూయెంజా, హెర్పెస్ జోస్టర్, హెపటైటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల వంటి వ్యాధుల నివారణకు వయోజనులు కూడా టీకాలను పరిగణించాలని సూచించారు.
వయోజనుల వ్యాక్సినేషన్ తక్కువగా ఉండటానికి వైద్య నిపుణుల్లో తగినంత అవగాహన లేకపోవడం, వ్యాక్సిన్ల భద్రత, దుష్ప్రభావాలపై ఉన్న అపోహలు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ సేవలను సద్వినియోగం చేసుకోకపోవడం, ప్రభుత్వ నిధులు, రీయింబర్స్‌మెంట్ విధానాల్లోని పరిమితులు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. వ్యాక్సినేషన్ బాల్య దశకే పరిమితం కాదని, జీవితాంతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ముఖ్యమైన భాగమని కాంటినెంటల్ హాస్పిటల్స్ పేర్కొంది. వయోజనుల్లో టీకాలపై అవగాహన పెంచడం, నివారణ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం తమ ప్రధాన లక్ష్యాల్లో భాగమని స్పష్టం చేసింది.