తెలంగాణ పరిస్థితులపై మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన

- జగిత్యాల సభలో రేవంత్ సర్కార్ పై ఫైర్

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాజీ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలను, ఆ తరువాత సాధించిన విజయాలను ఆయన గుర్తు చేశారు.

జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు ఈ ప్రాంత భాష, సంస్కృతి, “తెలంగాణ” అనే పదానికే పరిమితులు విధించబడ్డాయని పేర్కొన్నారు. ఆ కాలంలో ప్రాంతీయ గుర్తింపు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా చిన్నాభిన్నమైందని, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో వేలాది మంది యువత ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లాల్సి వచ్చిందని వివరించారు.

ఇక విద్యుత్‌ ఛార్జీల పెంపుతో రైతులపై భారీ భారం పడిందని, అప్పటి ప్రభుత్వ నిర్ణయాలు అన్నదాతల నడుం విరిచాయని విమర్శించారు. రైతులు తమ సమస్యలపై ప్రశ్నించగా, బషీర్‌బాగ్ కాల్పులు వంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరాన్ని అణచివేయడం అనేది తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు.

సమైక్య పాలనలో భూముల కబ్జాలు విస్తృతంగా జరిగాయని, సాధారణ ప్రజల హక్కులు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. ఉద్యమ సమయంలో తాను వ్యక్తిగతంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రజల మద్దతు మరియు తన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగానని చెప్పారు.

చివరగా, ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, అది ప్రజల పోరాట ఫలితమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరచడానికి మళ్లీ అదే పోరాటస్ఫూర్తి అవసరమని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్ర ఆర్థిక ఆదాయం ప్ర‌స్తుతం దిగ‌జారిపోయిందని , రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా ప‌డిపోయింది. కాంగ్రెస్ పాల‌న‌లో రాష్ట్రం ఆర్థికంగా భారీగా న‌ష్ట‌పోయింద‌న్నారు. పండించిన పంట‌ల‌ను కొన‌కుండా, బొన‌స్ పేరుతో రైతుల‌ను మోస‌గించార‌ని వాపోయారు. ఉద్యోగుల‌ను మోస‌గించారనీ, ఆటో కార్మికుల ఉపాధిని కొల్ల‌గొట్టార‌ని విమర్శించారు. విద్యార్థుల‌కు ఫీజు బ‌కాయిలు చెల్లించ‌కుండా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆగం చేస్తుంద‌ని మండిప‌డ్డారు. హైడ్రా పేరుతో పేద‌ల ఇండ్ల‌ను కూల్చివేస్తున్నార‌ని, నిజామాబాద్ లో నిడ్రా.. జగిత్యాల లో జడ్రా తెస్తారని రాబోయే తమ ప్రభుత్వం వాటిని ఎత్తి వేస్తుందని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.