జనగణమన దినపత్రిక

ఫూలే దంపతుల ఆశయాలతో విద్యా విప్లవం: సీఎం రేవంత్‌రెడ్డి

5

జనగణమన బ్యూరో – హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణలో విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. విద్య ఒక్కటే ఆత్మగౌరవాన్ని, గుర్తింపును, సామాజిక పురోగతిని అందించే మార్గమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ సభలో సీఎం ప్రసంగించారు.

ఫూలే దంపతుల ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకం: దేశంలో ఎక్కడికి వెళ్లినా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌, మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి మహనీయుల విగ్రహాలు కనిపిస్తాయని సీఎం అన్నారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్‌ చౌరస్తాలో ఒకవైపు అంబేద్కర్‌, మరోవైపు ఇందిరాగాంధీ, మరోవైపు పీవీ నరసింహారావు, మరోవైపు జ్యోతిబా ఫూలే విగ్రహాలను ఆవిష్కరించుకోవడం గర్వకారణమన్నారు. 150 ఏళ్ల క్రితమే జ్యోతిబా ఫూలే విద్యే సామాజిక విముక్తికి ప్రధాన మార్గమని గుర్తించారని, తాను చదువుకోవడంతో పాటు తన సతీమణి సావిత్రీబాయి ఫూలేను చదివించి ఆదర్శంగా నిలిచారని రేవంత్‌రెడ్డి అన్నారు. శతాబ్దానికి పైగా కాలం గడిచినా ఫూలే ఆలోచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తున్నాయంటే ఆయన దూరదృష్టి, సిద్ధాంతాల గొప్పతనం అర్థమవుతుందని చెప్పారు.

విద్య ద్వారానే సామాజిక మార్పు: కుల నిర్మూలన, సామాజిక చైతన్యం సాధించాలంటే అందరూ కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం అవసరమని సీఎం అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను తీసుకొస్తోందని చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని, నర్సరీ స్థాయి నుంచే విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, పౌష్టికాహారం కల్పిస్తున్నామని తెలిపారు. విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు అకడమిక్‌ విద్యతో పాటు స్కిల్స్‌ నేర్పిస్తున్నామని, నైపుణ్యాలు ఉంటే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ముందుగానే విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత సమయంలో విద్యార్థుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ జమ అయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో ఏ కళాశాల కూడా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదన్నారు.

సర్టిఫికెట్‌తో పాటు నైపుణ్యాలు అవసరం: ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి కోర్సుల్లో సర్టిఫికెట్‌ సాధించడం మాత్రమే ఉద్యోగానికి హామీ ఇవ్వదని రేవంత్‌రెడ్డి అన్నారు. మారుతున్న ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లో నర్సింగ్‌ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, యువత అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. ఐటీ రంగంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, కొంతమంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయి తిరిగి వస్తున్న పరిస్థితులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అందువల్ల యువత ఒక్క రంగంపైనే ఆధారపడకుండా సాంకేతిక, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

119 నియోజకవర్గాల్లో ఏటీసీలు: 2024లో టాటా సంస్థతో కలిసి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు రూ.2,000 స్టైపెండ్‌ అందిస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలను అందించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు అవకాశాలు: గ్రూప్‌-1 నియామకాల్లో బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు గణనీయంగా ఎంపికయ్యారని సీఎం పేర్కొన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థుల మధ్య పోటీ తీవ్రంగా పెరిగిందని, మంచి మార్కులు సాధించే వారి సంఖ్య కూడా పెరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు మరింత నైపుణ్యంతో, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

క్రీడలకు ప్రాధాన్యం: విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం సముచిత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం అన్నారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, క్రీడల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పతకాలు సాధిస్తే నగదు ప్రోత్సాహకాలతో పాటు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనని రేవంత్‌రెడ్డి చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎంత బాధ్యతగా ఆలోచిస్తారో, తాను కూడా అంతే బాధ్యతతో యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తానని అన్నారు.

ఎస్సీ వర్గీకరణ, బీసీ జనగణనపై ప్రస్తావన: సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని సీఎం అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు దశాబ్దాలుగా పోరాడారని, తమ ప్రభుత్వం ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుందని తెలిపారు. బీసీ జనగణనను నిర్వహించడంలో తెలంగాణ ముందడుగు వేసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు ఉద్యోగాలు, విద్య, ఇతర అవకాశాల్లో న్యాయం చేయాలంటే వారి జనాభా వివరాలు కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. కులగణన విషయంలో కొందరు వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం ముందుకు సాగిందన్నారు.

“గొర్రెలు, బర్రెలు కాదు.. చదువు కావాలి”: గత ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీ, బలహీన వర్గాల పిల్లలు కేవలం సంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా ఉన్నత విద్యను అభ్యసించి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు కావాలని ఆకాంక్షించారు. “ఈ సమాజం చదువుకోవద్దా? ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావొద్దా?” అని ప్రశ్నించిన సీఎం.. చదువు ఒక్కటే తలరాతలను మార్చగలదని అన్నారు. తెలంగాణను ప్రపంచ పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలపడానికి విద్యే ప్రధాన మార్గమని స్పష్టం చేశారు.

చట్టసభల్లోకి ఫూలే స్ఫూర్తితో యువత: మహాత్మా జ్యోతిబా ఫూలే స్ఫూర్తిని తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యార్థులు భవిష్యత్తులో చట్టసభల్లోకి రావాలని, డాక్టర్లు, ఇంజినీర్లు, ఉన్నతాధికారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం చెప్పారు. యువత బంగారు భవిష్యత్తు కోసం తాను రోజుకు 18 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

“చదువు ఒక్కటే పరిష్కారం.. చదువు ఒక్కటే మార్గం. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకుని ముందుకు సాగాలి” అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విద్యా, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.