జనగణమన దినపత్రిక

గిరిజన యువత జాబ్ క్రియేటర్స్‌గా ఎదగాలి: మాజీ మంత్రి హరీశ్‌రావు

1

జనగణమన ప్రతినిధి – సిద్దిపేట: గిరిజన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి పది మందికి ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌రావు అన్నారు. గిరిజన యువతకు వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మార్గదర్శకత్వం అందిస్తున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (TICCI) కృషి అభినందనీయమని పేర్కొన్నారు. సిద్దిపేటలో TICCI ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సుతో పాటు సిద్దిపేట జిల్లా చాప్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రుణాలు, పారిశ్రామిక అవకాశాలపై అవగాహన కల్పించడంలో TICCI కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఆత్మవిశ్వాసం, పట్టుదలతో విజయాలు: గిరిజన యువత వ్యాపార రంగంలో రాణించాలంటే ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ ఎంతో అవసరమని హరీశ్‌రావు అన్నారు. కష్టపడే వారికి విజయాలు సాధించడం సాధ్యమేనని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన రమేష్ నాయక్ అనే గిరిజన యువకుడు లండన్‌లో 16 హోటళ్లను స్థాపించి గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారని ఉదాహరించారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో టీ-ప్రైడ్ ద్వారా సహకారం పొందిన సురేష్ నాయక్ హైదరాబాద్‌లో బర్త్‌డే కేకుల తయారీ రంగంలోకి ప్రవేశించి పెద్ద కంపెనీలతో పోటీ పడుతున్నారని చెప్పారు. ఇలాంటి విజయగాథలను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన యువత ముందుకు సాగాలని సూచించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో గిరిజనులకు ప్రాధాన్యం:  కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేసిందని హరీశ్‌రావు అన్నారు. గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వందల కోట్ల రూపాయల సబ్సిడీలను అందించామని తెలిపారు.దేశంలోనే తొలిసారిగా గిరిజన మహిళల కోసం రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని చెప్పారు. పెద్ద సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించామని పేర్కొన్నారు.

తెలంగాణ ఏర్పడిన అనంతరం గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచామని, దీనివల్ల అనేక మంది గిరిజన యువత డాక్టర్లు, ఇంజనీర్లు తదితర రంగాల్లో స్థిరపడే అవకాశం లభించిందన్నారు.

3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం: రాష్ట్రంలోని సుమారు 3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం కల్పించామని హరీశ్‌రావు అన్నారు. గిరిజన బిడ్డలను సర్పంచులుగా చేసి వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించామని తెలిపారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ ద్వారా జనాభా ప్రాతిపదికన కేటాయించిన నిధులు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఖర్చు కాకపోతే తదుపరి సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే సుమారు ఆరు లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను రైతులుగా మార్చామని పేర్కొన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి రూ.10 వేలు, పీజీ పూర్తి చేసిన వారికి రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని విమర్శించారు. ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2,730 కోట్లు కేటాయించామని ప్రభుత్వం అసెంబ్లీలో తెలిపిందని, అయితే అందులో కేవలం రూ.70 కోట్ల మేర మాత్రమే ఖర్చు చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ఆ నిధులు విద్యుత్‌ బిల్లులు, ఫ్యాన్లు, వాహనాల నిర్వహణ వంటి ఖర్చులకే సరిపోయాయని, గిరిజన యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమాలకు నిధులు వినియోగించలేదని విమర్శించారు.

లగచర్ల ఘటనపై తీవ్ర ఆరోపణలు: గిరిజనుల భూములకు సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. లగచర్లలో భూములు ఇవ్వబోమని ప్రశ్నించిన గిరిజనులపై కేసులు పెట్టి జైలుకు పంపించారని, వారిపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆరోపించారు. గిరిజనుల భూములను స్వాధీనం చేసుకుని ముఖ్యమంత్రి సోదరులు, బంధువులకు అప్పగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

TICCI ప్రెజర్‌ గ్రూప్‌గా పనిచేయాలి: ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తున్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. యువతకు జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని చెప్పినప్పటికీ ఉద్యోగాల భర్తీలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు.

ఈ పరిస్థితుల్లో TICCI వంటి సంస్థలు కేవలం పారిశ్రామిక మార్గదర్శకత్వం అందించే సంస్థలుగా మాత్రమే కాకుండా, గిరిజనుల హక్కులు, నిధులు, సబ్సిడీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రెజర్‌ గ్రూప్‌గా కూడా పనిచేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయించేందుకు కృషి చేయాలని కోరారు. గిరిజనుల సమస్యలపై అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని హామీ ఇచ్చారు.

TICCI సేవలను సద్వినియోగం చేసుకోవాలి:  సిద్దిపేట జిల్లాలోని గిరిజన యువతీ యువకులు TICCI అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సంస్థలో సభ్యులుగా చేరి వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. గిరిజన యువత ఉద్యోగాల కోసం వెతికే స్థాయి నుంచి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగడం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.