జనగణమన ప్రతినిధి – హైదరాబాద్: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ కార్యక్రమానికి కూకట్‌పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కూకట్పల్లి నియోజకవర్గాన్ని ఆదర్శంగా, ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబును ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
తాను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు కూకట్పల్లి ప్రజలు తనను ఆశీర్వదించి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించారని సీఎం గుర్తు చేశారు. అయితే తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ఆశించిన స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయానని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నందున కూకట్పల్లి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
“మీకు ఎలాంటి అభివృద్ధి కావాలో అడిగి చేయించుకోండి” అని ప్రజలకు సూచించిన సీఎం, కూకట్‌పల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత పదేళ్ల పాలనతో తమ రెండేళ్ల పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు.
పేదల సంక్షేమానికి ప్రాధాన్యం: రాష్ట్రంలోని 3.28 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచేలా ఇందిరమ్మ చీరలను సారెగా అందించామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, స్వయం సహాయక సంఘాలకు రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని వివరించారు.
మహిళా సంఘాలను కేవలం రుణాలు పొందే సంస్థలుగా కాకుండా ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళా సంఘాలకు బస్సుల యాజమాన్యాన్ని కల్పించడంతో పాటు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. వారి ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేందుకు శిల్పారామంలో స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అప్పులు చెల్లిస్తూనే సంక్షేమ పథకాలు: గత ప్రభుత్వం చేసిన అప్పులను చెల్లించుకుంటూనే మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు కొందరు ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు.
పేదల సొంతింటి కలకు ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’: పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో ‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. మొదటి విడతలో లక్ష ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
గతంలో డబ్బా ఇళ్లు వద్దని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పిన వారు ఎంతమందికి ఇళ్లు ఇచ్చారో ప్రజలు ఆలోచించాలని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మాత్రం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు. “మీ సొంతింటి కలను నిజం చేసేందుకు మీ సోదరుడిగా మీకు అండగా ఉంటా” అని సీఎం హామీ ఇచ్చారు.
భూముల విషయంలో ఆందోళన వద్దు: పట్టణాభివృద్ధి, ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రజలు తమ సొంత భూములను కోల్పోతారనే ఆందోళన అవసరం లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. “మీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత మాది” అని స్పష్టం చేశారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.
తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు: తెలంగాణను విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో కరువు రావాలని కొందరు క్షుద్రపూజలు చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే దేవుడు తమ వైపు ఉండటంతో వర్షాలు కురిశాయని అన్నారు. మంచి మనసుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తమ సంకల్పానికి దేవుడి ఆశీర్వాదం ఉందని చెప్పారు. కుటిల బుద్ధితో క్షుద్రపూజలు చేసే వారికి అవే తిరిగి ప్రతికూలంగా మారతాయని వ్యాఖ్యానించారు.
“నాకు వయసు ఉంది.. ఓపిక ఉంది.. మీకు మంచి చేయాలన్న సంకల్పం ఉంది. మీరు అండగా ఉండండి.. అభివృద్ధి చేసి చూపిస్తా” అని రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కూకట్పల్లి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.