పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాం బాధ్యత
- విదేశీ ఉపాధికి సమగ్ర వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
జనగణమన బ్యూరో – హైదరాబాద్: విదేశాల్లో ఉద్యోగాలు కోరుకునే యువతకు శిక్షణ, పాస్‌పోర్టు, ఉద్యోగ అవకాశాలు కల్పించడం నుంచి విదేశాల్లో వారి సమస్యల పరిష్కారం వరకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కాం) బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం శక్తి శాఖపై మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ నుంచి మధ్యప్రాచ్య దేశాలకు ఉపాధి కోసం వెళ్లే కార్మికులు ఏజెంట్ల మోసాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ మ్యాన్‌పవర్ సంస్థలతో టామ్‌కాం ఒప్పందాలు చేసుకుని, ఉద్యోగార్థులకు భద్రతతో కూడిన ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. విదేశాలకు పంపే ఏజెంట్ల వివరాలు, వారు పంపే ప్రతి కార్మికుడి సమాచారాన్ని నమోదు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టామ్‌కాం సీఈవోగా మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించాలని కూడా వెల్లడించారు.
స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణలకు అవసరమైన రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ తదితర విదేశీ భాషల బోధన కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆయా దేశాలకు చెందిన శిక్షకులను తీసుకురావాలని సూచించారు. బ్లూ కాలర్ ఉద్యోగాలకు శిక్షణ పొందే విద్యార్థులకు కూడా ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల తరహాలో ఆర్థిక సహాయం అందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ఇంటర్న్‌షిప్‌లకు ప్రాధాన్యం: ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలని సీఎం సూచించారు. చదువుతో పాటు ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా విద్యార్థులకు స్టైఫండ్‌తో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
ఏటీసీల్లో ఆధునిక కోర్సులు: ఎలక్ట్రిక్ వాహనాల (EV) సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ వంటి ఆధునిక కోర్సులను ఏటీసీల్లో ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. ఈవీల వినియోగం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో కూడా శిక్షణ అందించాలని చెప్పారు.
నర్సింగ్ కళాశాలల విస్తరణ: దేశీయంగానే కాక విదేశాల్లోనూ నర్సుల సేవలకు భారీ డిమాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నర్సింగ్ సిబ్బందికి అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో మరిన్ని నర్సింగ్ కళాశాలలకు అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో సీఎం ప్రధాన కార్యదర్శి ఎన్. శ్రీధర్, శక్తి శాఖ కార్యదర్శి హరిచందన, ఉపాధి–శిక్షణ డైరెక్టర్ నిర్మలా కాంతి వెస్లీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.