జనగణమన దినపత్రిక

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతిపై కేసీఆర్ తీవ్ర సంతాపం

- తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్నీ వ్యక్తం చేసిన పార్టీ అధినేత

2

జనగణమన బ్యూరో – హైదరాబాద్, జూలై 31: తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఒక ఆప్త మిత్రుడిని, ఉద్యమ సహచరుడిని కోల్పోయానని పేర్కొంటూ ఆయన సంతాపం తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనతో కలిసి పనిచేసిన రోజుల్ని కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడేందుకు పార్టీ చేసిన విశ్వప్రయత్నాలు, వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. తెలంగాణనే శ్వాసగా భావిస్తూ నీతి, నిజాయితీతో ప్రజాజీవితం గడిపిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి నిలిచారని కేసీఆర్ కొనియాడారు. పోరాటాల గడ్డ అయిన నర్సంపేటలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి, ఉద్యమ స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసిన ధీరుడని అభివర్ణించారు.

ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ పట్ల అపార విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యమంలోనూ, నియోజకవర్గ అభివృద్ధిలోనూ చెరగని ముద్ర వేశారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో పోలీసు ఒత్తిళ్లు, నాన్-బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న ఆయన పోరాట పటిమ, సేవలు కార్యకర్తలు, ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భార్యా పిల్లలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని సూచించారు.

పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.