హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వద్ద ప్రజా సంబంధాల అధికారిగా పని చేస్తున్న మధుసూదన్ ఆకస్మికంగా గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మరణించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక బాధ్యతలను గతంలో ఆయన నిర్వహించారు. విధి నిర్వహణలో నికార్సైన పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం చాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స నిర్వహిస్తున్న సమయంలో మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృతి చెందారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం: మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. అకాల మరణం తనకు ఎంతో దిగ్భ్రాంతిని కలిగించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అదేవిధంగా ఆయన మృతికి హెచ్యూజే, టీడబ్ల్యూజేఎఫ్ తో పాటు పలు జర్నలిస్టు సంఘాలు, ప్రముఖులు సంతాపం తెలియజేశారు.