చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనంతరం ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్‌కు శాఖల కేటాయింపులు చేపట్టారు. కీలక శాఖలను అనుభవజ్ఞులైన నేతలకు అప్పగిస్తూ పరిపాలనలో సమతుల్యత సాధించే ప్రయత్నం చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాష్ట్ర భద్రత, శాంతిభద్రతల దృష్ట్యా హోంశాఖను సీఎం విజయ్ తన దగ్గరే ఉంచుకున్నారు.
కేబినెట్‌లో యువ నేతలకు కూడా ప్రాధాన్యం కల్పించారు. క్రీడా శాఖను ఆధవ అర్జున్‌కు అప్పగించగా, పరిశ్రమలు, ఐటీ వంటి కీలక రంగాన్ని కీర్తనకు కేటాయించడం విశేషంగా మారింది. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను సెంగొట్టయన్‌కు అప్పగించారు. ఆరోగ్య శాఖను అరుణ్‌రాజ్‌కు కేటాయించగా, విద్యా రంగ బాధ్యతలను రాజమోహన్‌కు అప్పగించారు.
అలాగే విద్యుత్, న్యాయశాఖలను నిర్మల్‌కుమార్‌కు కేటాయించారు. గ్రామపంచాయతీ, నీటిపారుదల శాఖలను ఆనంద్ నిర్వహించనున్నారు. ప్రజల నిత్యావసర సరఫరాలకు సంబంధించిన సివిల్ సప్లైస్ శాఖ బాధ్యతలను వెంకటరమణన్‌కు అప్పగించారు. గనుల శాఖ మంత్రిగా డీకే ప్రభు నియమితులయ్యారు.
కొత్త కేబినెట్ కూర్పులో యువతకు, పరిపాలనా అనుభవం కలిగిన నేతలకు సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ఉపాధి అవకాశాల పెంపు, సాంకేతిక రంగ అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక శాఖల కేటాయింపుల అనంతరం మంత్రులు త్వరలోనే తమ తమ శాఖలపై సమీక్షలు ప్రారంభించనున్నారు.