హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అమరుల త్యాగాలకు ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల ఆశయాల సాధనకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లకు సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తూ, గత రెండున్నరేళ్లలో ప్రజల ఆకాంక్షల సాధన దిశగా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న సీఎం, రూ.20,616 కోట్ల వ్యయంతో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు. అలాగే రైతుభరోసా పథకం కింద ఇప్పటివరకు రూ.27,529 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. గత రెండున్నరేళ్లలో ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.82,840 కోట్లను ఖర్చు చేశామని, యాసంగి సీజన్లో దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతం ఉండటం రాష్ట్ర వ్యవసాయ ప్రగతికి నిదర్శనమన్నారు.
నీటిపారుదల రంగంలో కూడా కీలక చర్యలు చేపడుతున్నామని సీఎం పేర్కొన్నారు. నిలిచిపోయిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ జీవం పోసే చర్యలు ప్రారంభించామని, కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెబుతూ, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ప్రకటించారు. మహిళా సంఘాలకు ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించామని, ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఆర్థిక లాభం చేకూరిందన్నారు.
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని సీఎం తెలిపారు. గత రెండున్నరేళ్లలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో త్వరలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
పేదల గృహ కలను సాకారం చేసేందుకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, అందులో లక్ష ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తైందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసి అర్హులైన పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి కోసం రూపొందించిన Telangana Rising-2047 విజన్ ద్వారా 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం వెల్లడించారు. ప్రపంచానికి గేట్వేగా తెలంగాణను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు. తెలంగాణ అమరుల కలల రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రజల సహకారంతో ముందుకు సాగుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.