హైదరాబాద్: చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు పరిశ్రమల రంగంలో తెలంగాణ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక విద్య, పారిశ్రామిక వృద్ధి ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల (ATC)ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు ప్రముఖ టాటా గ్రూప్ తో కలిసి పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ATC కోర్సులను అప్‌గ్రేడ్ చేస్తున్నామని వెల్లడించారు. ప్రపంచ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలతో తెలంగాణ యువతను తయారు చేయడమే లక్ష్యమన్నారు.
గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక పాలసీ: విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల సంక్షేమం కోసం త్వరలో ప్రత్యేక పాలసీ తీసుకురానున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గల్ఫ్‌కు వెళ్లే కార్మికులకు శిక్షణ, బీమా, న్యాయ సహాయం, అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు వంటి అంశాలను ఈ పాలసీలో చేర్చనున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పెట్రోల్ ధరల పెంపుపై విమర్శలు: దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా సీఎం స్పందించారు. ఇంధన ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఒకవైపు ధరలు పెంచుతూ మరోవైపు ప్రజలకు ఇంధన పొదుపు చేయాలని సూచనలు చేయడం సరైన విధానం కాదన్నారు. పెరిగిన ఇంధన ధరల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతోందని పేర్కొన్నారు.
బండి భగీరథ్ కేసుపై స్పందన: పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ వ్యవహారంపై సీఎం స్పందిస్తూ, పోలీసులు అతడిని అరెస్ట్ చేశామని అధికారికంగా చెప్పారని తెలిపారు. తాను పోలీసుల మాటనే నమ్ముతున్నానని పేర్కొన్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పోక్సో కేసుల్లో బాధితుల వివరాలు బహిర్గతం చేయడం చట్టవిరుద్ధమని సీఎం స్పష్టం చేశారు. మైనర్‌ను అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కొందరు BRS నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.