రేవంత్ రెడ్డి కీలక సూచనలు

- ఎస్ఐఆర్‌పై పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం

ఎస్ఐఆర్‌పై పూర్తి అవగాహనతో ముందుకు సాగాలి: పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశ

హైదరాబాద్‌: గాంధీ భవన్ లో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు కీలక సూచనలు చేశారు. ఎస్ఐఆర్‌పై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన పెంచుకోవడం సంతోషకరమని పేర్కొన్న సీఎం, ఈ ప్రక్రియ వల్ల సామాన్యులు, పేదలు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎదురయ్యే ఇబ్బందులను ముందుగానే గుర్తించడం మంచి పరిణామమన్నారు. ఎస్ఐఆర్ కారణంగా లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున వలసలు జరిగిన నేపథ్యంలో వారి ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. మహిళలు, దళితులు, మైనార్టీల ఓట్లపై కూడా ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు.

ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పార్టీ నాయకులకు సూచించారు. గతంలో బూత్ ఎన్‌రోలర్ల సహాయంతో కేవలం 90 రోజుల్లోనే 45 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేసిన విషయాన్ని గుర్తుచేసిన సీఎం, ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేసిన వారికి రాహుల్ గాంధీ చేతుల మీదుగా సన్మానం నిర్వహించామని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన ఎన్‌రోలర్ల సేవలను ఎస్ఐఆర్ విషయంలో కూడా వినియోగించుకోవాలని సూచించారు. డిజిటల్ మెంబర్‌షిప్ కోసం ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించి నిరంతరం పర్యవేక్షణ చేపట్టినట్లు చెప్పారు. అదే విధంగా ఇప్పుడు ఎస్ఐఆర్ కోసం రాష్ట్రంలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు. అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లు తప్పనిసరిగా నియోజకవర్గాల్లోనే ఉండాలని స్పష్టం చేసిన సీఎం, వారు సమర్థంగా పనిచేస్తే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా కాపాడవచ్చన్నారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒకరోజు పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే కేటాయించాలని సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని, తాను కూడా ప్రతి పది రోజులకు ఒకసారి కార్యకర్తలతో సమావేశమవుతానని వెల్లడించారు. నెలలో మూడు రోజులు పూర్తిగా పార్టీ కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు.

పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు సహా అందరూ పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. “నాతో పాటు ఎవరికీ మినహాయింపు లేదు” అని ఆయన స్పష్టం చేశారు. మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు అన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపిన సీఎం, ఇప్పుడు పార్టీ తరఫున వేలాది మంది సర్పంచ్‌లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు ఉన్నారని పేర్కొన్నారు. వలసలు వెళ్లిన వారి ఓట్లు తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని, నాయకులు క్షేత్రస్థాయికి వెళ్తేనే కార్యకర్తలు బూత్ స్థాయిలో పనిచేస్తారని అన్నారు.

హైదరాబాద్ నగర పరిధిలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సీఎం సూచించారు. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్‌పై అసెంబ్లీ వారీగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ల వారీగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.