భువనేశ్వర్: డాక్టర్ అచ్యుత సమంత ఆలోచనలకు ప్రేరణగా ప్రారంభమైన 13వ అంతర్జాతీయ ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్ డే’ను ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఘనంగా నిర్వహించారు. ఆరు ఖండాల్లో విస్తరించిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 50 వేల ప్రాంతాల్లో ఆర్ట్ ఆఫ్ గివింగ్ ఉద్యమ అనుచరులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, ప్రతి నగరం, పట్టణం, అలాగే ఒడిశాలోని జిల్లా కేంద్రాలు, బ్లాకులు, పంచాయతీల వరకు ఈ వేడుకలు నిర్వహించడం విశేషం. ఒడిశాలోనే 20 వేల ప్రాంతాల్లో కార్యక్రమాలు జరిగాయి. ఈ ఏడాది ఆర్ట్ ఆఫ్ గివింగ్ కార్యక్రమాల ద్వారా సుమారు 2.5 కోట్ల మందిపై ప్రత్యక్ష ప్రభావం పడినట్లు నిర్వాహకులు తెలిపారు.
గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని పలు నగరాల్లో ఆర్ట్ ఆఫ్ గివింగ్ కార్యక్రమాలు నిర్వహించగా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఏడాది ప్రత్యేక థీమ్‌తో ఈ వేడుకలను నిర్వహిస్తుండగా, ఈసారి “షేర్ టు షైన్” అనే థీమ్‌ను ఎంపిక చేశారు. ఇతరులతో ఆనందాన్ని పంచుకోవడం ద్వారా మన ఎదుగుదల, అభివృద్ధి కూడా సాధ్యమవుతుందనే సందేశాన్ని ఈ థీమ్ ద్వారా అందించారు.
ఈ సందర్భంగా ఒడిశాలో 3 వేలకుపైగా ప్రాంతాల్లో వాలీబాల్‌లు, నెట్‌ల పంపిణీ చేపట్టారు. యువతలో క్రీడా స్ఫూర్తి, స్నేహభావం పెంపొందించాలనే అచ్యుత సామంత దృక్పథంతో ఈ ఏడాది మొత్తం 9,100 వాలీబాల్‌లను పంపిణీ చేశారు. “నేను ఈ స్థాయికి రావడానికి ‘ఆర్ట్ ఆఫ్ గివింగ్’ భావనే ప్రధాన కారణం. ఈ ఉద్యమం ద్వారా ప్రజల ప్రేమ, ఆప్యాయత, ఆదరణ పొందాను” అని డాక్టర్ అచ్యుత సామంత పేర్కొన్నారు.
భువనేశ్వర్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందీ గాయకుడు షాన్ ఆలపించిన ఆర్ట్ ఆఫ్ గివింగ్ థీమ్ సాంగ్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి లోక్‌సభ ఎంపీ రబీంద్ర నారాయణ బెహెరా, భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, స్విట్జర్లాండ్‌కు చెందిన బౌద్ధ ఆధ్యాత్మిక గురువు గెట్రుల్ జిగ్మే రిన్‌పొచే, ఫెమినా మిస్ ఇండియా నికితా పోర్వాల్ తదితరులు హాజరయ్యారు.
సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించిన వైద్య నిపుణుడు డాక్టర్ బిద్యుత్ దాస్, రోటేరియన్ అజయ్ అగర్వాల్, కీఐఐటీ ప్రొఫెసర్ కుమార్ దేవదత్తలకు ప్రతిష్ఠాత్మక ‘ఏఓజీ హీరో అవార్డులు’ ప్రదానం చేశారు. ప్రతి అవార్డు గ్రహీతకు రూ.1 లక్ష నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో కీఐఐటీ, కిస్ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ సరణ్జిత్ సింగ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.