ఖమ్మం, జూలై 10: ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ, “రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే.. ఖమ్మం జిల్లా నా గుండెకాయ లాంటిది” అని పేర్కొన్నారు. 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీశారని గుర్తు చేశారు. అదే జూలై నెలలో మరోసారి చింతకాని సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్‌కు తిరిగి అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని, బీఆర్ఎస్‌ను ప్రజలే తిరస్కరించారని సీఎం పేర్కొన్నారు. “రాబోయే కురుక్షేత్రంలో కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి పూర్తిగా తొలగించే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు” అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, పార్లమెంట్ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని చెప్పారు. తదుపరి సాధారణ ఎన్నికలు 2029 మే లేదా జూన్‌లో జరిగే అవకాశం ఉందని, ఆ ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 117 స్థానాలు గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందిస్తూ, ఒకసారి మేడిగడ్డ కుంగిపోవడంతోనే రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని, మళ్లీ నీటిని నింపాలనే డిమాండ్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని అన్నారు. ఖమ్మం జిల్లాలో 44 గ్రామాలు ప్రభావితమయ్యాయని పేర్కొంటూ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెట్టవద్దని బీఆర్ఎస్‌ను హెచ్చరించారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ నకిలీ సర్వేలను ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల తేదీలు, రిజర్వేషన్లపై స్పష్టత లేకుండానే సర్వేల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయని, ఆ పార్టీ భవిష్యత్తుపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే ప్రచారం వారి కుటుంబ సభ్యుల నుంచే వస్తోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సీఎం, ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసా సాయాన్ని రూ.12 వేలకు పెంచడంతో పాటు రైతు రుణమాఫీ అమలు చేసి లక్షలాది మంది రైతులను రుణభారం నుంచి విముక్తులను చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో అమలైన షాదీ ముబారక్, రైతు బంధు వంటి పథకాలను కూడా కొనసాగిస్తున్నామని వివరించారు.
ఖమ్మం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న సీఎం, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి మేరకు మధిరలో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరిగిన తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా కృషి చేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ప్రజలను కోరారు. సభ ముగింపులో “ఔర్ ఏక్ బార్… కాంగ్రెస్ సర్కార్” అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.