అచ్యుత సమంతకు అమెరికన్ ఏఏపీఐ ప్రతిష్ఠాత్మక అవార్డు
- సామాజిక సేవ, విద్యా విప్లవం, భారత్–అమెరికా భాగస్వామ్యానికి విశేష కృషికి అంతర్జాతీయ గుర్తింపు
భువనేశ్వర్, జూలై 10: ప్రముఖ విద్యావేత్త, సామాజిక సంస్కర్త, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (KIMS), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (KISS) వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సామంతకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ (AAPI) ప్రతిష్ఠాత్మక “ట్రాన్స్‌ఫార్మేషనల్ సోషల్ వర్క్ అండ్ ఇండో–యూఎస్ పార్ట్‌నర్‌షిప్ అవార్డు” లభించింది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో జూలై 2 నుంచి 5 వరకు నిర్వహించిన AAPICON–2026 మరియు AAPI 44వ వార్షిక మహాసభలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, మానవతా కార్యక్రమాల్లో ఆయన అందించిన విశేష సేవలు, దాతృత్వం, ప్రపంచ ఆరోగ్య సదస్సు–2026 సందర్భంగా AAPIకి అందించిన సహకారం, అలాగే భారత్–అమెరికా సంబంధాల బలోపేతానికి చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించారు.
AAPI అధ్యక్షుడు డాక్టర్ అమిత్ చక్రవర్తి సుమారు 3 వేల మంది వైద్యుల సమక్షంలో డాక్టర్ అచ్యుత సామంతకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన జీవితాంతం పేదలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్య, వైద్యం, మానవతా సేవల ద్వారా చేసిన కృషిని AAPI ప్రత్యేకంగా కొనియాడింది. అమెరికాలో భారతీయ మూలాల వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్న AAPI అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటి. ఈ సంస్థకు 1.20 లక్షలకు పైగా భారతీయ మూలాల వైద్యులు సభ్యులుగా ఉన్నారు. అమెరికా వ్యాప్తంగా వైద్య సేవలు అందిస్తున్న ఈ సంస్థ వార్షిక మహాసభకు ఈ ఏడాది 3 వేల మందికి పైగా వైద్యులు హాజరయ్యారు.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవమైన జూలై 4న, డాక్టర్ అచ్యుత సామంతను ప్రత్యేక అతిథిగా, ముఖ్య వక్తగా ఆహ్వానించారు. తన ప్రసంగంలో భారతీయ వైద్యులు ప్రపంచ ఆరోగ్య రంగంలో పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసించిన ఆయన, భారత్–అమెరికా మధ్య ఆరోగ్య రంగ సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని వివరించారు. అదేవిధంగా, ప్రతి నెలా కొద్ది రోజులు భారతదేశానికి వచ్చి గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య సేవలు అందించాలని AAPI సభ్య వైద్యులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన AAPI నాయకత్వం, తమ సభ్య వైద్యులు ప్రతి నెల 7 నుంచి 15 రోజుల పాటు భారతదేశంలో ఉచిత వైద్య సేవలు, వైద్య సలహాలు అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చింది. డాక్టర్ అచ్యుత సామంతకు లభించిన ఈ అంతర్జాతీయ గౌరవం భారత విద్యా, సామాజిక సేవా రంగాలకు దక్కిన అరుదైన గుర్తింపుగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.