జనగణమన దినపత్రిక

వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణ క్రీడాకారుల సత్తా

- మూడు రాష్ట్రాల్లో 18 పతకాలు.. జాతీయ స్థాయిలో తెలంగాణకు ఘన గుర్తింపు

2

జనగణమన బ్యూరో హైదరాబాద్: జాతీయ స్థాయిలో జరుగుతున్న వివిధ వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేశారు. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కానోయింగ్, రోయింగ్, స్విమ్మింగ్ జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటి మొత్తం 18 పతకాలు సాధించారు. ఇందులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఉన్నాయి.

కానోయీ స్ప్రింట్‌లో 8 పతకాలు: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న అస్మిత కానోయీ స్ప్రింట్ నేషనల్ చాంపియన్‌షిప్ సబ్-జూనియర్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు మొత్తం 8 పతకాలు సాధించారు. 1000 మీటర్ల విభాగంలోని కానోయీ సింగిల్‌లో ఎన్. బిందు రజత పతకం సాధించారు. కానోయీ డబుల్‌లో పి. జస్విక–కె. అనూష జోడీ, కానోయీ ఫోర్‌లో కె. బిందు–పి. జస్విక–ఆర్. రేఖ–కె. అనూష బృందం స్వర్ణ పతకాలు సాధించింది. కయాక్ సింగిల్ విభాగంలో ఎం. చందన్ కాంస్య పతకం సాధించగా, కయాక్ ఫోర్‌లో ఎం. చందన్–శ్రావంతి–అవంతిక–సింధు జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 500 మీటర్ల విభాగంలో కానోయీ సింగిల్‌లో కె. అనూష రజత పతకం సాధించగా, కానోయీ డబుల్‌లో ఎం. బిందు–పి. జస్విక జోడీ స్వర్ణ పతకం సాధించింది. దీంతో భోపాల్ పోటీల్లో తెలంగాణ ఖాతాలో 8 పతకాలు చేరాయి.

రోయింగ్‌లో ఆరు పతకాల మోత: పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో ఆగస్టు 5 నుంచి 10 వరకు జరుగుతున్న 27వ సబ్-జూనియర్ నేషనల్ రోయింగ్ చాంపియన్‌షిప్లోనూ తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. మొత్తం 10 విభాగాల్లో పోటీపడిన తెలంగాణ జట్టు 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలతో మొత్తం 6 పతకాలు సాధించింది. అండర్-13 బాలుర డబుల్ స్కల్స్‌లో ఎం. యశ్వంత్, ఎస్. శివరామ్, అండర్-13 బాలికల డబుల్ స్కల్స్‌లో ఛ. ధాత్రి, ఆర్. తరుణి, బాలికల సింగిల్ స్కల్స్‌లో ఏ. వర్షిత స్వర్ణ పతకాలు సాధించారు.

బాలికల పెయిర్ విభాగంలో ఎస్. దేవేంద్రమ్మ, కె. లావణ్య రజత పతకం సాధించారు. బాలుర ఫోర్ విభాగంలో ఆమిర్, లాలు, నితిన్, టి. ఉపేంద్ర, బాలికల ఫోర్ విభాగంలో ఎన్. ఆరుషి, వి. అమని, వి. అక్షిత, ఆర్. నిహారిక కాంస్య పతకాలను సాధించారు.

స్విమ్మింగ్‌లోనూ మెరిసిన తెలంగాణ: రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరుగుతున్న జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్లో తెలంగాణకు మరో రెండు పతకాలు లభించాయి.

50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో ఆరుష్ దాస్ 29.44 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకం సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఆయనకు ఇదే తొలి పతకం కావడం విశేషం. మహిళల 100 మీటర్ల ఫ్రీస్టైల్‌లో శివాని కార్రా 1:01.28 సమయంతో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఇదే చాంపియన్‌షిప్‌లో శివాని ఇప్పటికే ఒక స్వర్ణం, ఒక రజత పతకాన్ని సాధించడం విశేషం. దీంతో స్విమ్మింగ్‌లోనూ తెలంగాణ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకున్నారు.

క్రీడాకారులు, కోచ్‌లకు అభినందనలు: జాతీయ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి అభినందించారు.

క్రీడాకారుల విజయాల వెనుక నిరంతరం శ్రమించిన కోచ్‌ల సేవలను కూడా అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు. రోయింగ్‌లో ఇస్మాయిల్ బేగ్ (ద్రోణాచార్య అవార్డు గ్రహీత), ఒలింపియన్ మంజీత్ సింగ్ (ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత), జి. గీతాంజలి (స్పోర్ట్స్ స్కూల్–ఖేలో ఇండియా కోచ్) కృషిని అభినందించారు.

అలాగే కానోయింగ్, కయాకింగ్ విభాగం కోచ్‌లు రామకృష్ణ, నిషి, స్విమ్మింగ్ కోచ్ ఆయుష్ యాదవ్ను కూడా అధికారులు అభినందించారు.

మరిన్ని విజయాలు సాధించాలి: జాతీయ వేదికపై తెలంగాణ జెండాను రెపరెపలాడించిన క్రీడాకారులందరికీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ హృదయపూర్వక అభినందనలు తెలిపింది. క్రీడాకారులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించింది.

వాటర్ స్పోర్ట్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సాధించిన ఈ విజయాలు రాష్ట్రంలో క్రీడా ప్రతిభకు ఉన్న అవకాశాలను మరోసారి చాటిచెప్పాయని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.