హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి తన ప్రతిభను చాటుతూ చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ISSF World Cup 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచి 43 హిట్స్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇషా సింగ్ సాధించిన ఈ అరుదైన విజయంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. తన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదలతో ఇషా లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో భారత జెండాను రెపరెపలాడిస్తూ తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు.
భారత క్రీడల భవిష్యత్తు ఎంతో ఉందనడానికి ఇషా సింగ్ వంటి యువ క్రీడాకారులే నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇషా మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు.