పాలమూరు ప్రాజెక్టుల పూర్తి మా ప్రభుత్వ లక్ష్యం

– సీఎం రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్, జూన్ 5: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో పాలమూరు ప్రాంత సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆశించారని, అయితే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ ఆశలు నెరవేరలేదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. పాలమూరు జిల్లా పర్యటన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో భారీగా ఖర్చు చేసినప్పటికీ రైతులకు ఆశించిన ప్రయోజనాలు అందలేదన్నారు. రాష్ట్రంలో గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, అందులో దాదాపు రూ.1 లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుపైనే వెచ్చించారని సీఎం పేర్కొన్నారు. అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మాత్రం నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 90 టీఎంసీల నీటిని అందించే అవకాశం ఉందని, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులతో అనుసంధానం చేసి పూర్తి చేసి ఉంటే పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని చెప్పారు. గత ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు కోసం రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టిందని, అయితే ఆ నిధుల్లో ఎక్కువ భాగం పంపులు, లిఫ్టులు, యంత్ర సామగ్రి కొనుగోళ్లకే వెచ్చించారని విమర్శించారు. “వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీరు అందించకుండా పనులను మధ్యలోనే వదిలేశారు” అని ఆయన అన్నారు.

ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నా ముందుగా భూసేకరణ పూర్తి చేయాల్సి ఉంటుందని, కానీ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల కోసం అవసరమైన భూసేకరణను గత ప్రభుత్వం చేపట్టలేదని సీఎం పేర్కొన్నారు. భూసేకరణ లేకుండా ప్రాజెక్టులు పూర్తవుతాయని ఎలా భావించారో అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం, కమిషన్లు పొందడమే గత ప్రభుత్వ లక్ష్యంగా కనిపించిందని రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సంవత్సరాల పాటు పోరాటం చేశారని గుర్తు చేశారు. తాను పాలమూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తినని, జిల్లాకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కృతనిశ్చయంతో పనిచేస్తున్నానని చెప్పారు. అయితే ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.84,503 కోట్ల అప్పు చేసిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 నెలల్లో ఆ అప్పుల్లో రూ.52,120 కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. అదే సమయంలో తమ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే చెల్లించిందని, అందులో రూ.8 వేల కోట్లు పాలమూరు ప్రాజెక్టులకే వెచ్చించామని తెలిపారు.

“మేము ఎక్కువ ఖర్చు పెట్టామా? తక్కువ ఖర్చు పెట్టామా? ప్రజలే నిర్ణయించాలి” అని సీఎం అన్నారు.

ప్రస్తుతం కూడా ప్రాజెక్టులకు సంబంధించి మరో 4 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందని, రాబోయే రెండేళ్లలో జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం దెబ్బతీసినా, ఆ పరిస్థితులను అధిగమిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రాజెక్టుల పనులు 90 శాతం పూర్తయ్యాయని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని సీఎం పేర్కొన్నారు. అంచనా వ్యయంలో 50 శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని ఎలా చెబుతున్నారో అర్థం కావడం లేదన్నారు. “ఆ సైన్స్, మ్యాథ్స్ నాకు అర్థం కావడం లేదు. నేను 80 వేల పుస్తకాలు చదవలేదు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ప్రజల సొమ్మును దోచుకుని ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని దోషులుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన సీఎం, ప్రజలకు వాస్తవాలు బాగా తెలుసని చెప్పారు. పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికే తాను జిల్లాలో పర్యటిస్తున్నానని పేర్కొన్నారు. భూసేకరణ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. “ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోలేం. అలా చేస్తే చరిత్ర మనల్ని క్షమించదు” అని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన సీఎం, బీఆర్ఎస్ నేతలకు కూడా సూచన చేశారు. “ఈ రెండేళ్లు ఏమీ మాట్లాడకుండా ఉంటే అదే వారు జిల్లాకు చేసే పెద్ద సహాయం” అని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.