జనగణమన బ్యూరో – న్యూఢిల్లీ: దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, ధరల స్థిరీకరణ, వినియోగదారులకు మెరుగైన సేవల అందజేత వంటి అంశాలపై పార్లమెంటరీ స్థాయిలో విస్తృత చర్చ జరిగింది. పెట్రోలియం, సహజవాయువు శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగింది. స్థాయీ సంఘం ఛైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు సంఘ సభ్యులు, వివిధ ప్రభుత్వ చమురు సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో దేశంలో ప్రస్తుతం ఉన్న క్రూడాయిల్, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు, వాటి సరఫరా పరిస్థితులు, పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ పరిణామాల ప్రభావం వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, సరఫరాలో అంతరాయం లేకుండా చూడడం, వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై సభ్యులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అలాగే పెట్రోలియం ఉత్పత్తుల ధరల హెచ్చుతగ్గులు, ధరల నియంత్రణ, స్థిరీకరణ చర్యలు, ఇంధన కల్తీ నివారణ, నిల్వలు మరియు రవాణా సమయంలో ప్రమాదాల నివారణ, వ్యర్థాలను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు వంటి అంశాలపై అధికారులు సమావేశానికి వివరాలు అందించారు. ఈ అంశాలపై స్థాయీ సంఘం సభ్యులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరింత నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందేలా చమురు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యటిస్తూ పెట్రోల్ బంకులు, గ్యాస్ పంపిణీ కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలని, కల్తీ, అక్రమాలు, వినియోగదారుల ఫిర్యాదులపై వెంటనే స్పందించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
ఇంధన రంగంలో నాణ్యత ప్రమాణాల అమలు, భద్రతా నిబంధనల పకడ్బందీ అమలు, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన చర్యలను మరింత వేగవంతం చేయాలని సమావేశంలో సభ్యులు అధికారులకు సూచించినట్లు సమాచారం. సమావేశంలో వచ్చిన సూచనలు, సిఫార్సులను పరిశీలించి తగిన చర్యలు చేపడతామని చమురు సంస్థల అధికారులు స్థాయీ సంఘానికి వివరించారు.