హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ దిశగా మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో “తెలంగాణ డిజిటల్ క్యాబినెట్” అమలుకు అధికారికంగా ఆమోదం లభించింది. డిజిటల్ క్యాబినెట్ వ్యవస్థ అమలులో భాగంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరికీ ప్రత్యేక ట్యాబ్‌లను సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా డిజిటల్ క్యాబినెట్ నిర్వహణ విధానం, సాంకేతిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలపై మంత్రులకు వివరణ ఇచ్చారు.
క్యాబినెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండా, విధాన పత్రాలు, ప్రతిపాదనలు, శాఖల నివేదికలు, తీర్మానాలు తదితర సమాచారమంతా ఇకపై ఈ ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా మంత్రులకు అందుబాటులో ఉండనుంది. దీంతో వేలాది పేజీల కాగిత వినియోగం తగ్గడమే కాకుండా, సమాచార నిర్వహణ మరింత వేగవంతం, పారదర్శకంగా మారనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా డిజిటల్ క్యాబినెట్ వ్యవస్థ పనితీరును పరిశీలించి, మంత్రులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశోధించారు. ప్రభుత్వ నిర్ణయాలు, పరిపాలనా ప్రక్రియలు సాంకేతికత ఆధారంగా మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, డిజిటల్ క్యాబినెట్ ద్వారా సమావేశాల నిర్వహణలో సమయం ఆదా కావడంతో పాటు పత్రాల భద్రత, డేటా రక్షణ, తక్షణ సమాచార మార్పిడి వంటి అంశాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యమవుతుంది. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ నిర్ణయం దోహదపడనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు శాఖల్లో ఈ-ఆఫీస్, డిజిటల్ ఫైల్ మేనేజ్‌మెంట్, ఆన్‌లైన్ సేవల అమలులో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుండగా, ఇప్పుడు డిజిటల్ క్యాబినెట్ అమలు ద్వారా స్మార్ట్ గవర్నెన్స్‌కు మరింత బలం చేకూరనుంది. రాష్ట్ర పరిపాలనను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ పారదర్శక, వేగవంత, సమర్థవంతమైన పాలన అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ నిర్ణయం నిదర్శనంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.