జనగణమన దినపత్రిక

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ తెలంగాణపై వివక్షే: సీఎం రేవంత్ రెడ్డి

4

జనగణమన బ్యూరో – హైదరాబాద్:  సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రాల కలయికే కేంద్ర ప్రభుత్వమని, అదే భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం విద్య, క్రీడలు, పెట్టుబడుల లక్ష్యంగా విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు. విదేశీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించామని, ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించారని సీఎం అన్నారు. ఈ నిర్ణయానికి రాజకీయ కారణాలున్నాయని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఆ రాజకీయ కారణాలేమిటో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఆగస్టు 17 నుంచి 28 వరకు అమెరికా, కెనడా పర్యటనకు గుజరాత్ ముఖ్యమంత్రికి పెట్టుబడుల ఆకర్షణ కోసం అనుమతి ఇచ్చారని, అదే సమయంలో ‘తెలంగాణ రైజింగ్–2047’లో భాగంగా తాను అమెరికా పర్యటించాలనుకుంటే అడ్డుకోవడం వివక్షకు నిదర్శనమని విమర్శించారు. “నా పర్యటనలో అభ్యంతరం ఉంటే ఇంగ్లాండ్‌కు ఎందుకు అనుమతి ఇచ్చారు? అమెరికాకు ఎందుకు నిరాకరించారు?” అని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంగ్లాండ్‌లో విద్యాభ్యాసం చేసి దేశానికి దార్శనికులుగా మారారని గుర్తుచేస్తూ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు విదేశాల్లో చదివే అవకాశం లేని పరిస్థితిలో విదేశీ విద్యా, క్రీడా సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు.

ఈ అంశం తన వ్యక్తిగత అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమని సీఎం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దీనిని ఖండించాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవడం రాష్ట్ర అభివృద్ధిని వ్యతిరేకించడమేనని, ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధమని అన్నారు. తెలంగాణ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు. కేంద్ర వైఖరి వల్ల తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు దెబ్బతినే ప్రమాదం ఉందన్న ఆవేదన వ్యక్తం చేశారు.

డిసెంబర్ 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 నిర్వహించనున్నట్లు ప్రకటించిన సీఎం, విద్య, క్రీడలు, పెట్టుబడుల రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని చెప్పారు. తమ విదేశీ పర్యటన పూర్తిగా అధికారికమైందని, అన్ని కార్యక్రమాలు భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలోనే జరుగుతాయని, అవసరమైన అన్ని వివరాలను విదేశీ వ్యవహారాల శాఖకు ముందుగానే అందించామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత భేదాలు ఉండవచ్చని, అయితే కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాన్ని ఎవరూ అడ్డుకోలేరని, పెట్టుబడులు, అభివృద్ధి కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.