జనగణమన దినపత్రిక

పోలవరం పై కీలక నిర్ణయం

- 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ / అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రాజెక్టు పనుల పురోగతి, నిధుల అవసరాలపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కేంద్రం మరింత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.

మరో రూ.3,300 కోట్ల విడుదలకు అంగీకారం: పోలవరం నిర్మాణ పనులు వేగంగా కొనసాగేందుకు మరో రూ.3,300 కోట్ల నిధులను విడుదల చేయడానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.2,300 కోట్ల నిధులను విడుదల చేసింది. తాజా నిర్ణయంతో ప్రాజెక్టు పనులు మరింత వేగం అందుకునే అవకాశముంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి పరివాహక ప్రాంతాలకు సాగునీరు అందడమే కాకుండా, పలు జిల్లాలకు తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అదనంగా జలవిద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ, కాలువల ద్వారా నీటి పంపిణీ వంటి అనేక ప్రయోజనాలు రాష్ట్రానికి చేకూరనుంది. దీర్ఘకాలంగా నిధుల కొరత, సాంకేతిక సమస్యలు, నిర్మాణ ఆలస్యాలతో నిలిచిపోయిన పనులకు కేంద్రం తాజా నిర్ణయం ఊరటనిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం పూర్తి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.