జనగణమన దినపత్రిక

నాగార్జునసాగర్‌లో వరుణ యాగం

- సమృద్ధిగా వర్షాలు కురవాలని 108 మంది రుత్వికులు.. 11 హోమగుండాలతో మహా యాగం

3

జనగణమన ప్రతినిధి – నల్గొండ: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా మారాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళను సంతరించుకోవాలని, నాగార్జునసాగర్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లో వరుణ యాగం ఘనంగా ప్రారంభమైంది.

నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ పర్యాటక అతిథి గృహం సమీపంలోని కృష్ణానది వద్ద ఈ మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు, సిద్ధాంతులు యాగ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.

108 మంది రుత్వికులతో ప్రత్యేక క్రతువులు: వరుణ యాగం కోసం ప్రత్యేకంగా 11 హోమగుండాలను ఏర్పాటు చేసి, 108 మంది రుత్వికులతో యాగాన్ని నిర్వహిస్తున్నారు. వేద మంత్రోచ్ఛారణలు, హోమ క్రతువులతో నాగార్జునసాగర్ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు నిండటంతో పాటు వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్ధిగా లభించాలని, రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని యాగంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి హాజరు: వరుణ యాగం పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు. ఆగస్టు 10న మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్‌కు చేరుకోనున్నారు. యాగ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖకు చెందిన అధికారులు, వేదపండితులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.

వర్షాలు.. జలాశయాల నిండుదలే లక్ష్యం:  ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ రంగానికి వర్షాలు అత్యంత కీలకంగా ఉన్న నేపథ్యంలో వరుణ యాగానికి ప్రాధాన్యం ఏర్పడింది. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవడం ద్వారా సాగునీటి వనరులు నిండాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు పండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహాలు పెరగడంతో పాటు నాగార్జునసాగర్, శ్రీశైలం తదితర ప్రధాన జలాశయాలు నిండాలని యాగంలో సంకల్పం చేశారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు కూడా నీటితో కళకళలాడాలని పూజలు నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు వరుణ యాగానికి సంబంధించిన ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌లో యాగ క్రతువులను నిర్వహిస్తున్నారు.

వరుణ యాగంపై విమర్శలు: 

– ప్రజాధనంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై అభ్యంతరాలు

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో నిర్వహిస్తున్న వరుణ యాగంపై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు కురవడానికి శాస్త్రీయంగా అనుసరించాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో యాగాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వరుణ యాగం నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం, అధికారులు పాల్గొనడం, ఏర్పాట్ల కోసం నిధులు ఖర్చు చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, మిషన్ కాకతీయ తరహా పనులు, రైతులకు సాగునీటి అందుబాటు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విమర్శకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని ఖర్చు చేసే ప్రతి కార్యక్రమానికి ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం ఉండాలని, ముఖ్యంగా వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సమస్యల పరిష్కారంపై నిధులను కేంద్రీకరించాలని వారు కోరుతున్నారు.

నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి: వర్షాలు సమృద్ధిగా కురవాలంటే ప్రకృతి వనరుల పరిరక్షణ, అటవీ విస్తీర్ణం పెంపు, చెరువులు–కుంటల పునరుద్ధరణ, వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు, భూగర్భ జలాల పెంపు వంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.