జనగణమన ప్రతినిధి – సంగారెడ్డి: ముఖ్యమంత్రి ఎవరైనా తమ నియోజకవర్గానికి రావాలని కోరుకుంటారు… వరాలు జల్లు, ఆ జల్లులతో కొంత కరువు తీరుతుందని, కనీసం కొన్ని సమస్యలకు అయినా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తారు. కానీ ఈ నెల 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సభ పూర్తిగా భిన్నం. వరాలైతే లేక పోగా అవమానాల జాతర సాగిందని విమర్శకులు భావిస్తున్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి లు తమ ఊకదంపుడు ఉపన్యాసంతో ఊగిపోతూ, ఒక్క సమస్యను లేవనెత్తలేదు. చివరికి ఉమ్మడి మెదక్ జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి అయినా ఒక్క అంశాన్నీ ప్రస్తావించలేకపోయారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొన్ని ఒక్క సమస్యపైనైనా అవగాహన లేదని విమర్శలు వస్తున్నాయి. కాగా మరో మంత్రి దామోదర రాజనర్సింహా ఒక్కరే ఒకే ఒక్క కోరికతో సింగూరును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట వరసకు కూడా హామీనివ్వలేదు. ఏలాగూ ఏ సమస్య పరిష్కరించే శక్తి తమ ముఖ్యమంత్రికి లేదని మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు ముందే డిసైడ్‌నట్లు కనిపించింది. సాధారణంగా ముఖ్యమంత్రి ఒక జిల్లాను సందర్శించినప్పుడు ప్రజాప్రతినిధుల నుండి ప్రజలనుండి వినతులు వెల్లువెత్తుతాయి. కానీ సంగారెడ్డి సభలో మాత్రం చెప్పుకోదగ్గ వినతిపత్రాలు కూడా ఇవ్వలేదు మరియు ప్రజాప్రతినిధులు కూడా ఎటువంటి కోరికలు కోరలేదు.
సిగాచీ పేలుడు ఘటన…
దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదం. 54 మంది మృత్యువాత పడ్డారు. 26 మంది క్షతగాత్రులుగా మిగిలారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తానని ప్రగల్భాలు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గానీ , కంపెనీ ఇస్తుందా..? అని జర్నలిస్టులు ప్రశ్నిస్తే ఎవరిస్తే ఏంటీ.. కోటి నింపుతే సరిపోతుంది కదా అంటూ రేవంత్‌రెడ్డి ఆ జర్నలిస్టునే దబాయించారు. పరిహారం పంపిణీ దపదపాలుగా కొనసాగింది. కార్మికుల కుటుంబాల న్యాయ పోరాటం వల్లే ఆ మాత్రం ఇచ్చారు. కోర్టులు మెట్టికాయలు వేసిన ప్రతిసారీ కొంత చెల్లిస్తూ వచ్చారు. సంవత్సరం గడిచిపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు అందింది 42 లక్షల రూపాయలు మాత్రమే. అంటే సగం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కంపెనీ చేతులు ఎత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు చెల్లించినట్లు, మిగతా పరిహారంతో మాకు సంబంధం లేదని, మిగిలినది ప్రభుత్వమే చెల్లించాలని న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ కుటుంబాలు చకోరా పక్షుల్లా ఎదురుచూస్తున్నాయి. క్షతగాత్రలు, బాధితులు సీఎం సభ సందర్భంగా ఆశ ఎదురు చూసి నిరాశకు గురయ్యారు.
ప్రభుత్వ ఖర్చు – పార్టీ మీటింగ్: సిఎం రేవంత్‌రెడ్డి పర్యటన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సభలా సాగింది. పదవీ కాలం ముగిసిన వారు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వారు, అప్పుడెప్పుడో పురాతన కాలంలో ప్రజాప్రతినిధులుగా పని చేసిన వారు ఇలా కాంగ్రెస్ నేతలతో సభా వేదిక నిండిపోయింది. చివరికి ఐఎఎస్ అధికారులు వెనుక వరుసులో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చింతా ప్రభాకర్‌కు గానీ, జిల్లాలో మరో ఎమ్మెల్యే మాణిక్‌రావుకు కానీ కనీస సమాచారం ఇవ్వని అధికారుల దిగజారుడుతనం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అధికార కార్యక్రమాన్ని పూర్తిగా కాంగ్రెస్ నాయకులకు అప్పగించి వెనుక సీట్లకు పరిమితమయ్యారు. ప్రోటోకాల్ ఉల్లంఘనకు ఆధ్యులయ్యారు.
ర్యాలీ – విమర్శలు: ఇదంతా ఒకెత్తయితే, సంగారెడ్డికి జరిగిన అవమానాల చిట్టా మరో ఎత్తు. స్థానిక ఐబి గెస్ట్ హౌస్ నుండి సభా స్థలి వరకు ప్రచార రథంలో వచ్చారు. ప్రచార రథంలో సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పిసిసి అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బ్యానెట్ పైకెక్కి రేవంత్‌రెడ్డి కాళ్ల దగ్గర కూర్చున్నారు. ఇదీ సంగారెడ్డి ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని విమర్శకులు అంటున్నారు. జగ్గారెడ్డి, రేవంత్‌రెడ్డి కలిసి సంగారెడ్డికి ఈ స్థాయి అవమానం చేయడం సమంజసమేనా.! పైగా జగ్గారెడ్డి గురించి సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు సంగారెడ్డిని అవమానించడం కాదా.! పిచ్చోడు, సిగ్గులేనోడు అంటూ సంగారెడ్డి ప్రతినిధిగా పేర్కొనడం ప్రజలకు జరిగిన అవమానం కాదా..? అంటూ విమర్శలొస్తున్నాయి. ఆ స్టేజీపై జగ్గారెడ్డి వ్యక్తిగా నిలబడలేదు. ఓడినా.. ఈ నియోజకవర్గ ప్రతినిధిగానే ఉన్నప్పటికీ, నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సిన మాటలను అలా సభా వేదికపై నుండి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనడం నియోజకవర్గ ప్రజలను చిన్న చూపు చూసినట్లేనని విమర్శకులు పేర్కొంటున్నారు.

మారని జగ్గారెడ్డి తీరు: మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరూ ఎప్పుడూ ఇంతే. తెలంగాణా ఉద్యమంలో సమైఖ్య పాట పాడుతూ, సంగారెడ్డి పరువు తీసిన జగ్గారెడ్డి, ఉద్యమాకరులపై దాడులు చేసి, తెలంగాణా ఇస్తే.. తాను పార్టీకి రాజీనామా చేస్తానంటూ కాంగ్రెస్‌ను బ్లాక్ మెయిల్ చేసిన మహానుభావుడని తెలంగాణ ఉద్యమకారులు పేర్కొంటున్నారు. రాష్ట్రం ఏర్పాటు జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న జగ్గారెడ్డి ఇప్పుడు సంగారెడ్డి పరువును తీసుకెళ్లి నేరుగా రేవంత్‌రెడ్డి దగ్గర తాకట్టు పెట్టాడని విమర్శలొస్తున్నాయి. తనకూ, తన భార్యకూ పదవి కోసం వింత స్టంట్‌లు వేస్తూ సిఎం పర్యటన సందర్భంగా ఎఎస్‌పి పైనా, పోలీసులపైనా చిందులు తొక్కుతూ నానా హంగామా సృష్టించాడని సభకు హాజరైన వారు పేర్కొన్నారు.
సంగారెడ్డి కి సున్నా లాభం: సిఎం రేవంత్‌రెడ్డి పర్యటనతో నియోజకవర్గానికి పైసా లాభం లేదు. పోనీ జగ్గారెడ్డికి ఏమైనా కనీస హామీ లభించిందా అంటే పిచ్చోడు, సిగ్గులేనోడు అంటూ చురకలు లభించాయి. పదవీ హామీ మాత్రం లభించలేదు. పాపం.. కింద ఉన్న నాయకులకు, కార్యకర్తలు కేరింతలు కోడుతూ సంబరపడ్డారు. ఈ విషయం అర్థమై కేరింతలు కొట్టారో, లేక అర్థంకాక కేరింతలు కొట్టారో తెలియదు.
ఇంతచేసి సిఎం రేవంత్‌రెడ్డి పర్యటన పరమార్థం ఏమిటీ..? కేవలం… కాగితం రూపంలో, కార్డు రూపంలో ఉన్న రేషన్‌కార్డును స్మార్ట్ కార్డుగా మార్చడం. లబ్ధిదారుని కుటుంబ సభ్యుల ఫోటోలు తొలగించి సిఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫోటోలు పెట్టుకోవడం జరిగింది. దీని కోసం ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ప్రకటనలు, పర్యటనల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మినహా సిఎం పర్యటనలో పెద్దగా ఒరిగింది లేదని విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మేల్కొని ప్రభుత్వం దగ్గర పదవుల కోసం వెంపర్లాడకుండా సంగారెడ్డి సమగ్ర అభివృద్ధి కోసం నిధులు తెచ్చుకునేలా… ఇక్కడి పేరు ప్రఖ్యాతలు గౌరవమర్యాదలకు భంగం రాకుండా చూడాలని విమర్శకులు కోరుతున్నారు.