హైదరాబాద్ రహదారుల అభివృద్ధిపై సీఎం సమీక్ష
- అన్ని రోడ్లను ఒకే వ్యవస్థలోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశం
జనగణమన బ్యూరో – హైదరాబాద్: హైదరాబాద్ మహానగర రహదారుల అభివృద్ధి, నిర్వహణ, భూసేకరణ, టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) విధానం, రేడియల్ రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల పురోగతిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో హెచ్ఎండీఏ/హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (HRDCL) అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్ పరిపాలన & పట్టణాభివృద్ధి) జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి మణిక్ రాజ్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారుల అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి సమగ్ర డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR), నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ప్రధాన రహదారులు, భూసేకరణ, రుణాలు, నిర్వహణ వంటి అన్ని అంశాలను ఒకే సిస్టమ్‌లోకి తీసుకురావాలని సూచించారు. రహదారుల నిర్వహణకు సంబంధించిన ప్రతి సమాచారం పారదర్శకంగా అందుబాటులో ఉండే విధంగా వ్యవస్థను రూపొందించాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ సంతృప్తికరంగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ORRపై ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ, రహదారి నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
టీడీఆర్ విధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ప్రభుత్వం సేకరించిన భూములకు మాత్రమే టీడీఆర్ వర్తించేలా చూడాలని, మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించాలని స్పష్టం చేశారు. టీడీఆర్‌లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పకడ్బందీ వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు. రేడియల్ రోడ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి, కొంగరకలాన్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రేడియల్ రోడ్–1 పనులను డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని చెప్పారు.
రోడ్ల నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా నిర్మాణంలో ఉపయోగించే మట్టి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రహదారులకు ఇరువైపులా విస్తృతంగా పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బద్వేల్ ఇంటర్చేంజ్ ట్రంపెట్ ప్రాజెక్టు అత్యంత కీలకమని పేర్కొన్న సీఎం, ఎలివేటెడ్ కారిడార్–1, 11 పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అలాగే ఎలివేటెడ్ కారిడార్–111లో బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ వరకు పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు.
హైదరాబాద్ నగర భవిష్యత్ అభివృద్ధి సమర్థవంతమైన రహదారి వ్యవస్థపై ఆధారపడి ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని హెచ్చరించారు. రోడ్ల ప్రణాళిక, నిర్మాణ దశల నుంచే ట్రాఫిక్ శాఖను భాగస్వామ్యం చేయాలని, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించవద్దని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక, సమర్థవంతమైన రహదారి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.