జనగణమన బ్యూరో – హైదరాబాద్: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియపై నిఘా వర్గాల నుంచి అందిన సమాచారాన్ని సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, నియామక ప్రక్రియకు భంగం కలిగించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత శక్తులు ప్రయత్నిస్తున్నట్లు సీఎం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నియామక ప్రక్రియలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ, రవాణా, భద్రపరిచే ప్రక్రియలతో పాటు ప్రతి దశలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, నియామక పరీక్షలకు సంబంధించిన కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, పరీక్షలపై సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం, అపోహలు వ్యాప్తి చెందకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడే దళారులు, నకిలీ వెబ్సైట్లు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పరీక్షల నిర్వహణ పూర్తయ్యే వరకు సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్ విభాగాలు పూర్తిస్థాయి అప్రమత్తతతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. నియామక ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, సీవీ ఆనంద్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, వి.వి. శ్రీనివాస రావు, సీవీ సజ్జనార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.