జనగణమన దినపత్రిక

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

- ఆరు రోజులుగా మృత్యువుతో పోరాడి యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస

2

తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

జనగణమన బ్యూరో – హైదరాబాద్, జూలై 31: తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఆయన శుక్రవారం తెల్లవారుజామున (జూలై 31) అర్ధరాత్రి 12:51 గంటలకు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురైన సుదర్శన్ రెడ్డిని తొలుత స్థానిక రోహిణి ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం, పల్మనరీ ఎంబోలిజం (ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం) కారణంగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ నిర్వహించడంతో గుండె స్పందన తిరిగి వచ్చినప్పటికీ, నాడీవ్యవస్థ స్పందించకపోవడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆరు రోజుల పాటు వైద్యులు చేసిన నిరంతర చికిత్స ఫలించక ఆయన కన్నుమూశారు.

వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయ నాయకుడిగా… పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా (ప్రస్తుత హనుమకొండ జిల్లా పరిధి) నల్లబెల్లి మండలం నల్లబెల్లి గ్రామంలో రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసాన్ని వరంగల్‌లో కొనసాగించి, 1991లో మహబూబియా పంజాథన్ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆయన భార్య స్వప్న. వీరికి కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు.

యూత్ కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం వరకు... యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డి, 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావం సందర్భంగా పార్టీలో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికై జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా సేవలందించారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. వరంగల్ కేంద్రంగా జరిగిన ఉద్యమ సభలు, మహాగర్జనలు, నిరసన కార్యక్రమాల్లో ముందుండి పనిచేశారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన ఆయన, పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను అంకితభావంతో నిర్వహించే నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఎమ్మెల్యేగా ప్రజాసేవ...2014 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి తొలిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తన నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, రైతుల సమస్యల పరిష్కారం, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు ఆహారం, మందులు, అత్యవసర సహాయం అందించడంలోనూ చురుకైన పాత్ర పోషించారు.

విషాదంలో బీఆర్ఎస్ శ్రేణులు: సుదర్శన్ రెడ్డి మరణవార్తతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నర్సంపేట నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడిగా, ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పలువురు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.