ప్రధాని సభను జయప్రదం చేయాలి

7823 కోట్ల రూపాయల అభివృద్ధి పథకాలు ప్రారంభించనున్న మోడీ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు

హైదరాబాద్: మే 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారని, మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు అన్నారు. శనివారం మీడియా సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావు మాట్లాడారు. ఈ పర్యటన సందర్భంగా సుమారు రూ. 7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారన్నారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ సిటీ, వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్, పీఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అదేవిధంగా హఫీజ్‌పేట్, జోగులాంబ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కూడా చేపడుతున్నారన్నారు. భవిష్యత్తులో వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్‌పోర్ట్ వంటి మరిన్ని ప్రాజెక్టులు కూడా రాబోయే దశలో అమలులోకి తీసుకువస్తారన్నారు. ఈ నేపథ్యం లో ప్రధాని సభను విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

 రాష్ట్రంలో అనేక సమస్యలు: ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దుర్భరంగా మారిందని, నెల మొదటి తేదీకి జీతాలు అందకపోవడం, టీచర్లకు వేతనాలు ఆలస్యమవడం వంటి అనేక సమస్యలు కొనసాగుతున్నాయన్నారు. 2015 తర్వాత పీఆర్‌సీ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు కూడా ఆలస్యంగా అందుతున్నాయి. హైకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే, నాలుగు వారాల్లోగా ఇవ్వాల్సిందేనని కోర్టు మొట్టికాయలు వేస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం రాలేదన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. ఉద్యోగులను కార్పొరేషన్ సిబ్బందిగా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మార్గంలో నడవకూడదు. ప్రకటనలు చేయడం కాకుండా, వెంటనే అమలు చేయడం అవసరం. కార్మిక సంఘాల పోరాటంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి ప్రకటన చేసినప్పటికీ, పూర్తి స్థాయిలో అమలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ప్రజలు ఇప్పటికీ ఆ హామీల అమలుకై ఎదురుచూస్తున్నారన్నారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది. నేను స్వయంగా పలు వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించాను. అక్కడ వరి ధాన్యం కుప్పలుగా పేరుకుపోయి ఉండటం, వర్షాల వల్ల పంట నష్టపోవడం వంటి దృశ్యాలు కనిపించాయన్నారు. సరైన సమయంలో లారీలు, ట్రక్కులు అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం లిఫ్టింగ్ ఆలస్యమవుతోందన్నారు. కొన్ని చోట్ల రైస్ మిల్లర్లు, మధ్యవర్తులు మరియు కొందరు అధికారులు కలిసి రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు తమ పంటను అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. వరి రైతులే కాకుండా, మొక్కజొన్న రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పంటలను కూడా ప్రభుత్వం ఎం ఎస్ పి ప్రకారం కొనుగోలు చేయాలి. రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. కాబట్టి రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.