హైదరాబాద్: తెలుగు ఫోక్ సింగర్ మంగ్లీ అలియాస్ సత్యవతి చుట్టూ నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ సంస్థలైన “శుభక్షేత్ర ఇన్ఫ్రా” పేరుతో జరుగుతున్న ఆర్థిక మోసాల కేసులో తన పేరు ప్రస్తావనకు రావడంతో మంగ్లీ మరోసారి సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తాజాగా చేసిన పోస్టులో, ఈ మోసాల కారణంగా అనేక మంది బాధితులు తీవ్రంగా నష్టపోయారని ఆమె పేర్కొంది. బాధితులకు న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేసింది. గతంలోనే బాధితుల తరఫున నిలబడతానని చెప్పానని, ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నానని వెల్లడించింది. అయితే ఈ ఆర్థిక మోసాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంగ్లీ బహిరంగంగా ప్రకటించింది. తాను ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనలేదని, తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, కొందరు వ్యక్తులు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. “నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు” అంటూ ఆమె మండిపడింది. నిజం త్వరలో బయటపడుతుందని, తనకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపింది. ఈ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఒకవైపు మంగ్లీకి మద్దతు పలుకుతున్నవారు ఉంటే, మరోవైపు ఆరోపణలను సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నవారు కూడా ఉన్నారు.