జనగణమన దినపత్రిక

హైదరాబాద్‌లో హార్వర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు

- ఫ్యూచర్‌ సిటీలో ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటు.. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలను ఆకర్షిస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

3

జనగణమన బ్యూరో – హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనగణమన): ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు డిసెంబర్‌ నుంచి అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణను గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీలో యూకే బిజినెస్‌ స్కూల్స్‌, యూనివర్సిటీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యూకే హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యుడు కరణ్‌ బిలిమోరియా, బ్రిటిష్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ జనక పుష్పనాథన్‌, చార్టర్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్కూల్స్‌ సీఈఓ ఫ్లోరా హామిల్టన్‌తో పాటు సుమారు 30 మంది యూకే యూనివర్సిటీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు

హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం తెలిపారు. ఎంఐటీ, పర్డ్యూ తదితర ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాయని పేర్కొన్నారు. హార్వర్డ్‌, ఎంఐటీ, లండన్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌, నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ వంటి ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలతో ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధన తదితర రంగాల్లో భాగస్వామ్యాలను విస్తరించే అవకాశాలున్నాయని తెలిపారు. విద్యార్థులు ఇంగ్లీష్‌, జర్మన్‌, జపనీస్‌ వంటి విదేశీ భాషల్లో నైపుణ్యం సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

ఫ్యూచర్‌ సిటీలో ఎడ్యుకేషన్‌ హబ్‌

మారుతున్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా యువతకు అత్యాధునిక నైపుణ్యాలను అందించేందుకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని దేశంలోనే తొలి నెట్‌-జీరో గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీలో ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏర్పాటుతో భావితరాలకు విస్తృతమైన విద్య, పరిశోధన, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. తెలంగాణలో ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ ఏర్పాటైతే ప్రపంచ స్థాయి కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్రం వైపు మరింతగా ఆకర్షితమవుతాయని పేర్కొన్నారు.

ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆహ్వానం

డిసెంబర్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు యూకే బిజినెస్‌ స్కూల్స్‌, యూనివర్సిటీల ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. దావోస్‌లో జరిగే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ తరహాలో ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని తెలిపారు. ఫ్యూచర్‌ సిటీలో భారీ పెట్టుబడులకు ప్రపంచ అగ్రశ్రేణి సంస్థలు ముందుకొస్తున్నాయని సీఎం చెప్పారు. టీసీఎస్‌ రూ.70 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్మించనుందని, అమెజాన్‌ ఇప్పటికే రూ.లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్‌ నిర్మాణాన్ని చేపట్టిందని వివరించారు.

2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ

ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఫార్చ్యూన్‌–500 కంపెనీలు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి ఉన్నత విద్య వరకు, ఐటీఐలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, స్కిల్స్‌ యూనివర్సిటీలు, తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ద్వారా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2034 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్‌ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.