జనగణమన – సెంట్రల్ డెస్క్: ఏఎస్‌బీఎం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ఐఐఎం ఇండోర్, లక్నో, ముంబై మాజీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ బిశ్వజీత్ పట్టనాయక్‌కు ప్రతిష్ఠాత్మక 2026 AIMA కేవల్ నోరియా అవార్డు ఫర్ అకడమిక్ లీడర్‌షిప్ ఇన్ మేనేజ్‌మెంట్ ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నామినేట్ చేసింది. మేనేజ్‌మెంట్ విద్యలో దూరదృష్టితో కూడిన నాయకత్వం, సంస్థాగత అభివృద్ధి, విద్యా రంగంలో అత్యుత్తమ సేవలకు ఈ పురస్కారం అత్యున్నత గుర్తింపుగా నిలుస్తుందని ఏఎస్‌బీఎం యూనివర్సిటీ వెల్లడించింది.
ప్రొఫెసర్ పట్టనాయక్ ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్నారు. అమెరికాకు చెందిన అక్రెడిటేషన్ కౌన్సిల్ ఫర్ బిజినెస్ స్కూల్స్ అండ్ ప్రోగ్రామ్స్ అందించిన ఇంటర్నేషనల్ టీచింగ్ ఎక్సలెన్స్ అవార్డు, దేవాంగ్ మెహతా బెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ అవార్డు, డెక్కన్ హెరాల్డ్ అవార్డు తదితర గౌరవాలు ఆయనకు లభించాయి.
రెండు దశాబ్దాల క్రితం ప్రొఫెసర్ పట్టనాయక్ స్థాపించిన ఏషియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఒడిశా ప్రభుత్వ గుర్తింపుతో యూనివర్సిటీ స్థాయికి ఎదిగింది. ఆయన ఐఐఎంలో ప్రొఫెసర్, హెడ్‌గా పనిచేయడంతో పాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ (IIBM) డైరెక్టర్‌గా కూడా సేవలందించారు.
మేనేజ్‌మెంట్ రంగంలో పరిశోధకుడు, రచయితగా ఆయన 30కి పైగా పుస్తకాలు రచించడంతో పాటు, ప్రముఖ మేనేజ్‌మెంట్ జర్నల్స్‌లో 115 పరిశోధనా పత్రాలను ప్రచురించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, గురు ఘాసీదాస్ సెంట్రల్ యూనివర్సిటీ పాలక మండళ్లకు రాష్ట్రపతి నామినీగా నియమించింది. అలాగే నూతన విద్యా విధానంపై నీతి ఆయోగ్ కన్సల్టేటివ్ కమిటీలోనూ ఆయన సేవలందించారు. ‘లగాన్’ చిత్రాన్ని ఐఐఎం పాఠ్యాంశాల్లో వినూత్న బోధనా విధానంతో అనుసంధానం చేసినందుకు ఆయనకు ‘లగాన్ ప్రొఫెసర్’ అనే ప్రత్యేక గుర్తింపు లభించింది. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును పద్మశ్రీ బాల వి. బాలచంద్రన్, పద్మశ్రీ బకుల్ ధోలాకియా, పద్మశ్రీ ప్రీతమ్ సింగ్ వంటి ప్రముఖ మేనేజ్‌మెంట్ నిపుణులు అందుకున్నారు.