జనగణమన దినపత్రిక

తెలంగాణలో ఆక్స్‌ఫర్డ్ విద్యా కార్యక్రమాలు

- ప్రపంచస్థాయి విద్య, పరిశోధనకు హైదరాబాద్‌ కేంద్రం: సీఎం రేవంత్‌రెడ్డి

2

జనగణమన – సెంట్రల్ డెస్క్: తెలంగాణలో పెద్ద ఎత్తున విద్యా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ఆహ్వానించారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం.. తెలంగాణతో యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాల కల్పనపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వారికి వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృత విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని సీఎం కోరారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు అందించాలని ఆహ్వానించారు.

ఈ సమావేశంలో సీఎం కార్యాలయ సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను వివరించారు.


తెలంగాణతో భాగస్వామ్యానికి సానుకూల స్పందన: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను వారు ప్రస్తావించారు.

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌’కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి బృందాన్ని పంపించాలని తెలంగాణ బృందం ఆహ్వానించింది.

ఇందిరాగాంధీ చిత్రపటాన్ని సందర్శించిన సీఎం: అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్‌విల్ కాలేజీని సందర్శించారు. అక్కడ విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటాన్ని సందర్శించి నివాళులర్పించారు. 2002లో సోనియా గాంధీ ఈ చిత్రపటాన్ని సోమర్‌విల్ కాలేజీకి బహూకరించిన విషయం తెలిసిందే.

క్రీడా మౌలిక వసతులపై జీఎంఆర్‌తో చర్చలు: జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను సందర్శించారు. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి సమగ్ర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన మౌలిక వసతులు, హోటల్ సదుపాయాలను పరిశీలించారు.

తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపై జీఎంఆర్ ప్రతినిధులు, సంస్థ గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్‌తో సీఎం చర్చలు జరిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రపంచస్థాయి క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ప్రస్తుత ప్రీమియర్ లీగ్ చాంపియన్స్ ఆర్సెనల్, కోవెంట్రీ మధ్య జరిగే ఈపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.