జనగణమన – సెంట్రల్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న నీటి పంపిణీ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం కనుగొనాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. తమిళనాడులోని కోవళం సమీపంలో గురువారం జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న నీటి వివాదాలపై సంబంధిత రాష్ట్రాలు కేంద్రంతో కలిసి పనిచేయాలని సూచించారు. నీటి సమస్యల పరిష్కారానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, అంతర్రాష్ట్ర మండలి ద్వారా సంబంధిత రాష్ట్రాలతో సంయుక్త సమావేశాలు నిర్వహించాలని అమిత్ షా సూచించినట్లు సమాచారం.
సమావేశంలో కావేరీ జలాల పంపిణీ, అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, రాష్ట్రాల మధ్య ఇతర సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. కర్ణాటక–తమిళనాడు మధ్య కొనసాగుతున్న కావేరీ జల వివాదం, మేకేదాటు ప్రాజెక్టు అంశాలు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్రం–రాష్ట్రాల మధ్య, అలాగే రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచడం ద్వారా అభివృద్ధి, మౌలిక వసతులు, భద్రత వంటి అంశాల్లో వేగంగా ముందుకు సాగవచ్చని సమావేశం స్పష్టం చేసింది. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.