జనగణమన ప్రతినిధి – సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందూలాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు. అనంతరం గ్రామ ప్రజలు, అభిమానులు, కుల సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లా ప్రజలపై శ్రీ రంగనాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల సుఖశాంతులు, జిల్లా అభివృద్ధి కోసం భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం రేణుక ఎల్లమ్మ ఆలయం, హనుమాన్ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. తాను గత 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని రాధాకృష్ణ శర్మ పేర్కొన్నారు. గ్రామ ప్రజలు చూపిస్తున్న ఆదరణ, అభిమానమే తనకు మరింత సేవా స్పూర్తిని కలిగిస్తోందని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని తెలిపారు. వారి ప్రోత్సాహంతో సిద్దిపేట జిల్లాలో ప్రజలకు మరింత చేరువై సేవ చేసే అవకాశం లభించిందని చెప్పారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడమే తన లక్ష్యమని, గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని రాధాకృష్ణ శర్మ స్పష్టం చేశారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, అల్లిపూర్ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సూరగోని రవి గౌడ్, సందిల భద్రయ్య, గండ్ల అంజిరెడ్డి, భూపతి రెడ్డి, దుర్గారెడ్డి, కందుకూరి బ్రహ్మం, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగం, నాయకులు రాచకొండ భిక్షపతి, బాల్ రెడ్డి, వార్డు సభ్యులు బుచ్చయ్య, రాము, అనిల్‌తో పాటు గ్రామ ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాధాకృష్ణ శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.