జనగణమన దినపత్రిక

చట్టసభల్లోకి జెన్ జీ…

- వయోపరిమితి తగ్గింపుపై ప్రత్యేక తీర్మానం: సీఎం రేవంత్

2

హైదరాబాద్, జూలై 25: శాసనసభ, లోక్‌సభకు పోటీ చేసే కనీస వయోపరిమితిని 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభకు 25 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. జెన్ జీ యువతకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

నీట్ ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, బాధిత విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై లాఠీచార్జీకి నిరసనగా పీసీసీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అనంతరం జెన్ జీ యువతను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 21 ఏళ్లకే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పుడు భారత యువతకు కూడా అలాంటి అవకాశాలు కల్పించాలన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించిన విషయాన్ని, పి.వి. నరసింహారావు హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

ప్రస్తుతం లోక్‌సభలో 543 మంది ఎంపీల్లో జెన్ జీ ప్రాతినిధ్యం ఒక శాతం కంటే తక్కువగా ఉండటం సమంజసం కాదన్నారు. దేశ జనాభాలో సుమారు 30 శాతం జెన్ జీ ఉన్న నేపథ్యంలో వారికి చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై ఆగస్టు తొలి వారంలో శాసనసభ, శాసనమండలిని ప్రత్యేకంగా సమావేశపరచి తీర్మానం ఆమోదించి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని సీఎం వెల్లడించారు. అలాగే 21 ఏళ్లకే సివిల్ సర్వీసులకు ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశమూ కల్పించాలని సూచించారు.

కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే విద్యాశాఖను జెన్ జీ నాయకుడికే అప్పగించేలా కృషి చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, ఐటీ వంటి శాఖలను యువతే సమర్థంగా నడిపించగలరని అభిప్రాయపడ్డారు. నీట్ పేపర్ లీక్ అంశంపై జెన్ జీ పోరాటాన్ని సీఎం అభినందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదని, పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.