హైదరాబాద్, జూలై 5: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం ఇవ్వడంతో పాటు, మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు.
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు మరింత ఆలస్యం కాకుండా కేంద్ర శాఖలతో సమన్వయం చేసి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. ఎస్‌బీఐ క్యాప్స్‌ను వెంటనే నియమించి, ఫేజ్-1 విలువ నిర్ధారణ, బదిలీ ప్రక్రియతో పాటు ఫేజ్-2 ఆర్థిక వ్యూహాన్ని రూపొందించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి నెల ఆలస్యంతో నిర్మాణ వ్యయం, వడ్డీ భారం పెరిగి వేల కోట్ల అదనపు భారం పడే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మెట్రో విస్తరణ నగర భవిష్యత్ అభివృద్ధికి అత్యంత కీలకమని కేంద్రం అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.