జనగణమన దినపత్రిక

మెట్రో రైలుపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు

- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రుల సంయుక్త సమావేశంలో కీలక నిర్ణయాలు

2

న్యూఢిల్లీ, జూన్ 23: హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో వరుసగా రెండు రోజుల పాటు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీన ప్రక్రియలో ఎదురవుతున్న అడ్డంకులు, అలాగే మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు అమలుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులకు వివరించారు. సోమవారం రాత్రి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చలు జరిపారు. మంగళవారం ఉదయం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెట్రో రైలు భవిష్యత్ ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మెట్రో రైలు ఫేజ్-1 విలువ నిర్ధారణ, స్వాధీనానికి అవసరమైన రుణ సమీకరణ, రుణ సంస్థల ఎంపిక వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్ణయించారు. అదేవిధంగా మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ, నిర్మాణ వ్యయం, ఆర్థిక వనరుల సమీకరణ తదితర అంశాలపైనా అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్‌బీఐ క్యాప్స్)ను కన్సల్టెంట్‌గా ఎంపిక చేశారు. మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఫేజ్-2 విస్తరణ, ఆర్థిక నమూనాలు, ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై ఎస్‌బీఐ క్యాప్స్ సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది. కన్సల్టెంట్ సమర్పించే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయి. మెట్రో రైలు అభివృద్ధికి సంబంధించిన తదుపరి చర్యలు, నిధుల సమీకరణ విధానం, అమలు ప్రణాళికపై ఈ నివేదిక కీలకంగా మారనుంది.

అలాగే కన్సల్టెంట్ అధ్యయనం సజావుగా, వేగవంతంగా పూర్తయ్యేలా కేంద్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అధికారి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (ఎంఏ అండ్ యూడీ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సమన్వయ అధికారులుగా నియమించేందుకు అంగీకారం కుదిరింది. ఈ ఇద్దరు అధికారులు కన్సల్టెంట్‌తో నిరంతరం సమన్వయం చేస్తూ అధ్యయన ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు భవిష్యత్ విస్తరణకు, నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనకు ఈ నిర్ణయాలు కీలక మలుపుగా భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.