వికారాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీగా చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు పోలీస్ అధికారులు చిక్కిన ఘటన సంచలనంగా మారింది. వికారాబాద్ లో ఈ దాడులు నిర్వహించారు. సమాచారం మేరకు, ఒక కేసు విషయంలో సహకారం అందించేందుకు ఇన్‌స్పెక్టర్ సరోజ మొత్తం ₹60,000 లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి నుంచి ఇప్పటికే ₹40,000 తీసుకున్న ఆమె, మిగతా ₹20,000 ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, మిగిలిన ₹20,000 తీసుకుంటున్న సమయంలో ఇన్‌స్పెక్టర్ సరోజను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఎస్ఐ రాణి కూడా భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఇరువురి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో వికారాబాద్ పోలీస్ శాఖలో కలకలం రేగింది.
అవినీతి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.